ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్‌ ను తమ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించింది సిక్కిం ప్రభుత్వం. ఈ విషయాన్ని సిక్కిం ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ చెప్పారు. గ్రామీ అవార్డు, ఆస్కార్ అవార్డు విన్నర్  ఏఆర్ రెహ్మాన్‌  సిక్కిం రాష్ట్రానికి ప్రచారకర్తగా వ్యవహరిస్తారని గాంగ్టక్‌లో జరిగిన ఒక వేడుకలో ప్రకటించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గాంగ్టక్‌లో జరిగిన సిక్కిం రెడ్ పాండా వింటర్ కార్నివాల్ వేడుకల్లో పాల్గొన్న రెహ్మాన్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రచారకర్తగా ప్రకటించారు. ఈ సందర్భంగా రెహ్మాన్ మాట్లాడుతూ- "నన్ను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు. దేశంలో ఈశాన్య రాష్ట్రాలు ప్రత్యేకమైనవి. వాటిలో సిక్కిం చాలా స్పెషల్. ఇక్కడి పర్వత అందాలు, ప్రజల సంప్రదాయం అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. ఈ అందాలకు సంగీతం తోడైతే వచ్చే అనుభూతి మాటల్లో వర్ణించలేనిది" అన్నారు. 


సిక్కింకు ప్రధాన ఆదాయ వనరులలో పర్యాటకం ఒకటని.. ఆ పర్యాటక వనరుల ప్రాధాన్యాన్ని తెలిపే పాటలకు సంగీతం అందిస్తానని.. తద్వారా సిక్కింకు అంతర్జాతీయ ఖ్యాతి వస్తుందని రెహ్మాన్ చెప్పారు.