శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని సోపియన్ జిల్లాలో శనివారం సాయంత్రం సైన్యం కాల్పుల్లో ఇద్దరు పౌరులు మరణించారు. పౌరుల మృతికి నిరసనగా ఆదివారం వేర్పాటువాదులు బంద్‌కు పిలుపునిచ్చారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో కాశ్మీర్ లోయలోని కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. దుకాణాలను మూసేశారు. రైళ్ళ రాకపోకలను ఆపేశారు. ప్రభుత్వ రవాణా స్తంభించింది. కాగా.. ఆత్మరక్షణ కోసమే తాము కాల్పులు జరిపినట్లుగా భద్రతాదళాలు తెలిపాయి. 


గనోవ్పుర గ్రామం నుంచి వెళ్తున్న భద్రతా దళాల కాన్వాయ్ పై కొందరు ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. వారిని పట్టుకొనేందుకు సైనికులు కాల్పులు జరపగా.. ఇద్దరు పౌరులు జావేద్ అహ్మద్ భట్(20), సుహైల్ జావేద్ లోనే(24) మరణించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ దర్యాప్తునకు ఆదేశించారు. పోలీసులు సైనికులపై కేసు నమోదు చేశారు. ముఫ్తీ రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా మాట్లాడారు. సీతారామన్ ఘటనపై వివరణాత్మక నివేదికను కోరినట్లు సమాచారం.