కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం ఫేస్బుక్ వేదికగా ఓ వార్త పంచుకున్నారు. కేంద్రానికి ప్రధాన ఆర్థిక సలహాదారుగా వ్యవహరిస్తున్న అరవింద్ సుబ్రమణియన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తన కుటుంబానికి సంబంధించిన కారణాల వల్ల ఆయన ఆ పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ పదవికి రాజీనామా చేశాక అరవింద్ సుబ్రమణియన్ అమెరికాకి వెళ్లిపోనున్నారు. అక్టోబరు 16, 2014 తేదిన అరవింద్ సుబ్రమణియన్ ఆర్థిక సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ అమలు చేయడంలో సుబ్రమణియనన్ ప్రధాన పాత్ర పోషించారు. కొద్ది రోజుల క్రితం అరవింద్ సుబ్రమణియన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తనతో మాట్లాడారని.. వ్యక్తిగత కారణాల వల్ల ఆయన రాజీనామా చేయనున్నట్లు తెలిపారని.. అందుకే ఆయన రాజీనామాని అంగీకరించానని జైట్లీ ప్రకటించారు. 


7 జూన్ 1959 తేదిన అరవింద్ సుబ్రమణియన్ చెన్నైలో జన్మించారు. ఐఐఎం అహ్మదాబాద్ నుండి ఎంబీఏ చేశారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుండి పీహెచ్‌డీ పొందారు. గతంలో సుబ్రమణియన్ ఐఎంఎఫ్‌ పరిశోధన విభాగానికి అసిస్టెంట్ డైరెక్టరుగా వ్యవహరించారు. మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్‌తో కలిసి పనిచేశారు. ఫైనాన్షియల్ టైమ్స్‌తో పాటు బిజినెస్ స్టాండర్డ్స్ పత్రికకు ఆయన కాలమిస్టుగా కూడా వ్యవహరించారు. 2011లో ఫోర్బ్స్ పత్రిక 100 గ్లోబల్ థింకర్స్‌లో ఒకరిగా సుబ్రమణియన్‌ను జాబితాలో పేర్కొంది.