ఇకపై తనకు ఏ బాధ్యతలూ ఇవ్వొద్దని ప్రధానికి జైట్లీ లేఖ
కేంద్ర కేబినెట్‌లో స్థానం లభిస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ గత కేబినెట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన అరుణ్ జైట్లీ పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. తనను కేబినెట్‌లోకి తీసుకోవద్దని విజ్ఞప్తి చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి అరుణ్ జైట్లీ తాజాగా ఓ లేఖ రాశారు.
న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్‌లో స్థానం లభిస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ గత కేబినెట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన అరుణ్ జైట్లీ పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. తనను కేబినెట్‌లోకి తీసుకోవద్దని విజ్ఞప్తి చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి అరుణ్ జైట్లీ తాజాగా ఓ లేఖ రాశారు. గత ఐదేళ్ల కాలంలో మీ (ప్రధాని నరేంద్ర మోదీ) నేతృత్వంలోని కేబినెట్‌లో పనిచేసి ఎంతో నేర్చుకున్నానని, అంతకన్నా ముందుగా పార్టీ తనకు ఎన్నో కీలక బాధ్యతలు అప్పగించిందని చెబుతూ పార్టీ పట్ల, ప్రధాని నరేంద్ర మోదీ పట్ల జైట్లీ తన కృతజ్ఞతాభావం చాటుకున్నారు. అయితే, అదే సమయంలో గడిచిన 18 నెలల్లో ఆరోగ్యరీత్యా తాను ఎన్నో సవాళ్లు ఎదుర్కున్నానని, తప్పనిసరి పరిస్థితుల్లో ఇకపై తన కోసం తాను కొంత సమయాన్ని వెచ్చించాలనుకుంటున్నానని అరుణ్ జైట్లీ తెలిపారు. అందువల్లే నూతన కేబినెట్‌లోకి తనను తీసుకోవద్దని ప్రధానికి రాసిన లేఖలో జైట్లీ విజ్ఞప్తిచేశారు.
నరేంద్ర మోదీ తొలిసారి దేశ ప్రధానిగా చేపట్టిన అనంతరం ఆర్థిక పరమైన అంశాల్లో అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. పాత పెద్ద నోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వంటివి అందుకు కొన్ని ఉదాహరణలు. అలా ప్రధాని తీసుకున్న పలు సంచలన నిర్ణయాలకు తన వంతు మద్దతు పలుకుతూ కేంద్ర ప్రభుత్వానికి జైట్లీ అండగా నిలుస్తూ వచ్చారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా తన కేబినెట్‌లో కొనసాగిన అరుణ్ జైట్లీ.. ఇకపై ఏ బాధ్యతల్లోనూ కొనసాగదల్చుకోలేదని చేసిన విజ్ఞప్తిపై ప్రధాని నరేంద్ర మోదీ ఏమని స్పందిస్తారో వేచిచూడాల్సిందే మరి.