ఢిల్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీలో చాలా ఉత్సాహం కనిపిస్తోంది. మరోసారి ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వడివడిగా పావులు కదుపుతోంది. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ప్రస్తుత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం పనులు మొదలు పెట్టారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

62 స్థానాలతో ఢిల్లీలో అఖండ విజయం సాధించిన తర్వాత .. ఈ రోజు లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ నివాసానికి వెళ్లారు కేజ్రీవాల్. ఆయన్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.  దాదాపు 45 నిముషాలపాటు ఆయనతో భేటీ అయిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్లిపోయారు అరవింద్ కేజ్రీవాల్. ఈ రోజు అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభా పక్ష సమావేశం ఉంది. ఈ భేటీలో కొత్త శాసన సభా పక్ష నాయకున్ని ఎన్నుకుంటారు. 


మరోవైపు ఢిల్లీ శాసన సభను నిన్ననే( మంగళవారం ) లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ రద్దు చేశారు. కానీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటి వరకు రాజీనామా చేయలేదు. ఆయన రేపు ( గురువారం) రాజీనామా చేసే అవకాశం కనిపిస్తోంది.  ఐదేళ్ల క్రితం.. అంటే ..  2015 ఫిబ్రవరి 14న 2015 ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ లెక్క ప్రకారం ఆయన ఫిబ్రవరి 13న రాజీనామా చేసే అవకాశం ఉంది.  ఐతే ఆయన రాజీనామా చేసిన తర్వాత ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఆయన్ను కోరతారు. 


మరోవైపు ఢిల్లీకి మూడోసారి ముచ్చటగా సీఎం కాబోతున్న అరవింద్ కేజ్రీవాల్ . .  ప్రమాణ స్వీకారోత్సవం కోసం ముహూర్తాన్ని నిర్ణయించుకున్నారు. ఫిబ్రవరి 16న ఉదయం 10 గంటలకు ఢిల్లీలోని ప్రఖ్యాత రామ్‌లీలా మైదాన్ లో ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.