ఉత్తరప్రదేశ్‌కి చెందిన ముస్లిం షహజాద్ రానా తన జీవితంలో ఓ అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. కుటుంబంతో సహా ఆయన ఇటీవలే హిందూ మతాన్ని స్వీకరించారు. తనకు పదే పదే శ్రీరాముడు స్వప్నంలో కనిపిస్తున్నారని.. తన పూర్వీకులు కూడా హిందువులేనని ఆయన తెలిపారు. భారతదేశంలో కొన్ని శతాబ్దాల క్రితం బలవంతంగా హిందువులను ముస్లిములుగా మార్చిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. తన కుటుంబం కూడా అలాగే ఇస్లామ్ మతంలోకి మారిందని ఆయన పేర్కొన్నారు. ఇటీవలే తనకు తన మూలాల గురించి తెలిసిందని.. అలాగే హిందువుల దైవమైన శ్రీరాముడు కూడా పదే పదే తనకు కలలో దర్శనమిస్తున్నాడని షహజాద్ తెలిపాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో తన పేరును కూడా  మార్చుకుంటున్నానని షహజాద్ తెలిపారు. సంజయ్ రానాగా పేరు మార్చుకున్నానని తెలిపిన ఆయన తన నిర్ణయాన్ని రాతపూర్వకంగా జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయానికి తెలియజేశారు. అయితే చిన్నప్పటి నుండి ముస్లింగా పెరిగిన తాను.. హిందూ మతాన్ని స్వీకరించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని.. వారి నుండి తనకు ప్రాణహానీ ఉందని రానా తెలిపారు. తనకు తగిన రక్షణను కల్పించాలని స్థానిక పోలీస్ స్టేషనుకి వినతి పత్రాన్ని అందజేశారు.


రానా అందించిన వినతి పత్రంపై జిల్లా ఎస్పీ దినేష్ కుమార్ స్పందించారు. రానా కోరిన మీదట కొన్నాళ్లు ఆయనకు రక్షణ కల్పిస్తామని.. కాకపోతే ఆయనకు ప్రాణహానీ ఉన్నట్లు బలమైన నిర్ధారణలు లేవని.. తమ ఎంక్వయరీలో ఆ విషయం అవగతమైందని తెలిపారు. అలాగే వేరే మతాన్ని స్వీకరించాలా లేదా అనేది రానా వ్యక్తిగత విషయమని...దానిపై తాము స్పందించమని ఆయన తెలిపారు. అయితే పలువురి ప్రోద్బలం వల్ల రానా మతం మారారని కొందరు తమకు ఫిర్యాదు చేశారని.. అయితే ఆ ఆరోపణలపై కూడా సరైన ఆధారాలు లేవని ఎస్పీ తెలిపారు. ఒకవేళ బలవంత మత మార్పిడి విషయమై రానాను ఎవరైనా ప్రోత్సహించినట్లయితే.. ఆయన తమకు నిరభ్యంతరంగా ఫిర్యాదు చేయవచ్చని పోలీసు అధికారి సూచించారు.