గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) మెరుగైన మెజారిటీ సాధిస్తున్న సందర్భంలో ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసద్దుద్దీన్ ఒవైసీ సోమవారం స్పందించారు. గుజరాత్ లో ముస్లింల ప్రాధాన్యత పెరుగుతోందనటానికి ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే సాక్ష్యం అని వెల్లడించారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ప్రచార తీరుపై మాట్లాడుతూ.. వీరిద్దరూ ఒక మందిరం నుండి మరో మందిరానికి వెళ్లి ఓటర్ల వద్దకు చేరుకున్నారని ఒవైసీ అన్నారు. 'బీజేపీని ఓడించాలంటే మరో బీజేపీలా మారడం కాదు. మనకు, బీజేపీకి తేడా చూపించాలి' అని అన్నారు. 


కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రచారాన్ని లక్ష్యంగా చేసుకొని ఒవైసీ మాట్లాడుతూ, గుజరాత్ లో బిజెపిని ఓడించడానికి కాంగ్రెస్ కు ఒక అద్భుతమైన అవకాశంగా వచ్చింది. కానీ అది విఫలమైంది. ప్రతిపక్షాలు జీఎస్టీపై ఎన్ని విమర్శలు చేసినా వ్యాపారుల కేంద్రంగా ఉన్న సూరత్ లో కూడా బీజేపీ గెలిచిందన్నారు. 


ఒవైసీ బిజెపి దేశంలో ఒక యంత్రం లాగా పనిచేస్తుందని అన్నారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా కలిసికట్టుగా ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. "అఖిలేష్ యాదవ్, అసదుద్దీన్ ఒవైసీ, మమతా బెనర్జీ విడిగా ఉంటే బీజేపీని ఓడించలేరు. ఐకమత్యంగా ఒక కూటమిని ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళితే బీజేపీని ఓడించవచ్చు' అని మనసులోని మాటను ఒవైసీ బయటపెట్టారు. 


ఎఐఎంఐఎం నేత ఒవైసీ బీజేపీ వరుస విజయాలపై స్పందిస్తూ.. మాజీ ప్రధాన మంత్రులను ఉటంకిస్తూ "ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు రాజకీయంగా ఉన్నత శిఖరాలకు చేరుకున్నప్పుడే ప్రజలు ఓడించారు" అని గుర్తుచేసుకున్నారు. "దేశంలో ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్నప్పుడు, ప్రజలే ప్రతిపక్షంగా మారి ప్రభుత్వాలను గద్దె దించారు" అన్నారు.


గుజరాత్ లో ఎదో గొప్ప ఘనత సాధించామని బిజెపి భావించినట్లయితే పునరాలోచన చేసుకోవాలి. ఔరంగజేబ్, పాకిస్థాన్ పేర్లు చెప్పుకొని బీజేపీ ఎప్పుడూ ఓట్లు సంపాదించలేదని ఒవైసీ అన్నారు.