కోల్‌కతా: ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించిన బుల్‌బుల్ తుఫాను క్రమక్రమంగా బలహీనపడింది. బంగ్లాదేశ్ లో తీరం దాటిన తర్వాత తుఫాను బలహీనపడినప్పటికీ.. తుఫాను బీభత్సం కారణంగా ఒడిషా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ లలో 13 మంది వరకు మృత్యువాతపడినట్టు ఫస్ట్ పోస్ట్ ప్రచురించిన ఓ వార్తా కథనం పేర్కొంది. పశ్చిమ బెంగాల్ పై బుల్‌బుల్ తుఫాను తీవ్ర ప్రభావం చూపించింది. అయితే, అప్పటికే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చాలామందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో భారీ సంఖ్యలో ప్రాణనష్టం తప్పిందని అక్కడి అధికారవర్గాలు తెలిపాయి. అనేకచోట్ల చెట్లు, విద్యుత్ స్థంబాలు కూలిపోవడంతో రహదారులపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ సంఖ్యలో నివాసాలు దెబ్బతిన్నాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  స్వయంగా దగ్గరుండి తుఫాన్ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

4.6 లక్షల మందిపై బుల్‌బుల్ తుఫాను ప్రభావం చూపించగా 1.8 లక్షల మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బాధితుల సహాయార్థం 471 శిబిరాలు ఏర్పాటు చేశారు. 60,000 నివాసాలు దెబ్బతిన్నట్టు ప్రాథమిక అంచనాలు వెలువడుతున్నాయి. 34 విద్యుత్ కేంద్రాలు దెబ్బతినగా అందులో 30 కేంద్రాలను తిరిగి పునరుద్దరించారు. 


బుల్‌బుల్ తుఫాను బలహీనపడినప్పటికీ... మరో 12 గంటలపాటు అప్రమత్తంగా ఉండాలని, జాలర్లు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లరాదని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.