దివికెగిసిన జన నేత.. రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో ప్రభుత్వ లాంఛనాల మధ్య పూర్తయిన అంత్యక్రియలు
దివికెగిసిన జన నేతకు ఇక సెలవు.. స్మృతి స్థల్‌లో అంత్యక్రియలు పూర్తి
రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో ప్రభుత్వ లాంఛనాల మధ్య మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి అంత్యక్రియలు పూర్తయ్యాయి. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో నిన్న సాయంత్రం 05:05 గంటలకు తుది శ్వాస విడిచిన వాజ్‌పేయికి అంతిమ వీడ్కోలు పలికేందుకు యావత్ ప్రపంచం కదిలొచ్చింది. భారత్ నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం వివిధ దేశాల అధినేతలు, ప్రతినిధులు, రాజ కుటుంబీకులు కదిలొచ్చారు. భరత జాతి మెచ్చిన భారత రత్న అవార్డు గ్రహీత అంతిమయాత్రలో జనం నిరాజనం పలికారు. అటల్‌జీ అమర్ రహే... నినాదాలతో బీజేపీ ప్రధాన కార్యాలయం, రాష్ట్రీయ స్మృతి స్థల్ పరిసరాలు మార్మోగిపోయాయి. దివికెగిసిన జననేతకు కడసారి వీడ్కోలు పలికేందుకు జనం వేల సంఖ్యలో తరలొచ్చారు.
యావత్ కేంద్ర కేబినెట్‌తోపాటు దేశం నలుమూలల నుంచి వచ్చిన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, బీజేపీ నేతలు వాజ్‌పేయి అంతిమయాత్రలో పాల్గొన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్మృతి స్థల్ వద్ద జరిగిన అంత్యక్రియల్లో పాల్గొని మరోసారి వాజ్‌పేయి పార్థివదేహానికి నివాళి అర్పించారు.