మాజీ ప్రధాని ఏబీ వాజ్‌పేయి ఆరోగ్యంపై స్పందించిన ఎయిమ్స్ !
ఆస్పత్రిలో చేరిన మాజీ ప్రధాని ఏబీ వాజ్‌పేయి
మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి ఆరోగ్యంగానే ఉన్నారని, యధావిధిగా జరిగే వైద్య పరీక్షల నిమిత్తమే ఆయన ఆస్పత్రిలో చేరారని ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ఈమేరకు సోమవారం రాత్రి ఎయిమ్స్ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం మాజీ ప్రధాని వాజ్‌పేయి ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎయిమ్స్ డైరెక్టర్ డా.రణ్‌దీప్ గులేరియా నేతృత్వంలోని వైద్య నిపుణుల బృందం ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహిస్తోందని ఎయిమ్స్ ఈ ప్రకటనలో పేర్కొంది. మాజీ ప్రధాని ఏబీ వాజ్‌పేయి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారనే వదంతుల నేపథ్యంలో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా గంభీరమైన వాతావరణం నెలకొంది.
వాజ్‌పేయి ఆస్పత్రిలో చేరారనే వార్తల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎయిమ్స్‌ని సందర్శించి ఏబీ వాజ్‌పేయిని పరామర్శించారు. సుమారు గంటసేపు వాజ్‌పేయితో ఆయన ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేసిన అనంతరమే మోదీ ఆస్పత్రి నుంచి బయటికొచ్చినట్టు తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేత ఎల్.కే. అద్వాని, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వంటి వారు వాజ్‌పేయిని పరామర్శించేందుకు ఎయిమ్స్‌ను సందర్శించిన వారిలో ఉన్నారు.