అది అటల్‌జీ చలవే.. ఆయనకు చేతులు జోడించి నమస్కరిస్తున్నా: ఎన్టీఆర్
భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి గురువారం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.
భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి గురువారం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సాయంత్రం 5: 05 నిమిషాలకు కన్నుమూశారు. వాజ్‌పేయి గౌరవార్థం ఈ నెల 16 నుంచి 22వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఏడు రోజులపాటు సంతాప దినాలను పాటించాలని కేంద్రం ప్రకటించింది. ఇదిలా ఉండగా.. ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ పలువురు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.
దేశం ఒక గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయిందని వాజ్‌పేయి మృతి పట్ల జూనియర్ ఎన్టీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. మన దేశాన్ని ప్రగతిపథంలో నడిపిన గొప్పనాయకుల్లో ఒకరైన వాజ్‌పేయికి చేతులు జోడించి నమస్కరిస్తున్నానని.. అటల్‌జీ విజన్ కారణంగానే స్వర్ణ చతుర్భుజితో దేశంలోని ప్రాంతాలన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానం అయ్యాయని తెలిపారు. అటల్‌జీ తమ గుండెల్లో ఎప్పటికీ జీవించే ఉంటారని..ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని ఎన్టీఆర్ తెలిపారు.
మాజీ ప్రధాని వాజ్‌పేయి నిస్వార్ధ రాజకీయ నాయకుడు.. దేశ రాజకీయాల్లో వాజ్‌పేయి లాంటి వ్యక్తులు ఉండటం చాలా అరుదని సినీ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు ఎం.మోహన్ బాబు అన్నారు.
‘‘భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్‌పేయి గారి మరణానికి చింతిస్తూ.. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము..’’- సురేష్ ప్రొడక్షన్స్
‘‘భరతమాత ముద్దుబిడ్డ,తన ఉపన్యాసంతో ప్రతిపక్షవాదిని కూడా మెప్పించగల మహోపన్యాసకుడు, పీజీ పట్టభద్రుడు, అడ్డదోవలో ప్రభుత్వాన్ని నిలబెట్టుకొనకుండా ఎన్నికలకు వెళ్లి, మళ్ళీ ప్రధాని అయిన నికార్సైన రాజకీయ నాయకుడు అటల్ బిహారీ వాజ్‌పేయిగారు పరమపదించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం’’ -సినీ రచయిత పరుచూరి గోపాల కృష్ణ