ఏటీఎంల్లో, బ్యాంకుల్లో నగదు కొరత సమస్య ఇప్పుడే తీరేలా లేనట్లుంది. తాము ఏర్పాటు చేసిన కమిటీ 2-3 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఎస్పీ శుక్లా చెప్పినా.. అందుకు తగిన క్షేత్రస్థాయి ఏర్పాట్లు లేవు. ముఖ్యంగా నోట్ల ప్రింటింగ్‌లో  కీలకమైన పేపరు, ఇంకు లాంటి ముడిసరుకులు తగినంతగా లేవని ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి. మరో వారం పాటు ఇదే కొనసాగుతుందని, క్రమేణా కుదటపడుతుందని ఆర్థికశాఖ వర్గాలు పేర్కొన్నాయి.


దేశంలోని పలు రాష్ట్రాలలో ఏటీఎంలో డబ్బులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. చాలా ఏటీఎంలు నగదు లేదనో, ఏటీఎం పని చేయడం లేదనో బోర్డులు వేలాడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లలో ఏటీఎంలలో నగదు కొరత సమస్యలు ఎక్కువగా ఉన్నాయని మీడియాలో వార్తలు వెలువడ్డాక..  మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ నగదు కొరతపై వివరణ ఇచ్చారు. త్వరలో ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు. బ్యాంకు బ్రాంచీలలో డిపాజిట్ల కన్నా విత్‌డ్రా ఎక్కువగా ఉండటం నగదు కొరతకు ఒక కారణంగా భావిస్తున్నారు. ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఎస్‌పి శుక్లా మాట్లాడుతూ సమస్య పరిష్కారానికి మూడు రోజులు పడుతుందన్నారు. సరిపడా నిధులు ఉన్నాయని శుక్లా చెప్పారు. కొన్ని రాష్ట్రాలలో నగదు ఎక్కువగా ఉందని, కొన్ని రాష్ట్రాలలో తక్కువగా ఉందన్నారు. ఒక రాష్ట్రంనుంచి నగదును మరొక రాష్ట్రానికి తరలించడానికి చర్యలు తీసుకున్నామని, దీనికి మూడు రోజుల సమయం పడుతుందని ఆయన చెప్పారు.