ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం తన ప్రభుత్వం అనేక ఆర్థిక సంస్కరణలను చేపట్టిందని, దేశాన్ని పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చిందని.. ఎఫ్డిఐతో దేశంలో పెట్టుబడులను ఆకర్షించామని తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అస్సాంలో రెండు రోజులపాటు జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ను ప్రారంభించిన మోదీ, ఎన్డీఏ ప్రభుత్వం అధికారిక యంత్రాంగం పనితీరును వేగవంతం చేసిందని, అనుకున్న లక్ష్యాలను అనుకున్న సమయంలో చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. 



తాజా బడ్జెట్ గురించి మాట్లాడుతూ, ఆరోగ్య భీమా పథకం- ఆయుష్మాన్  భారత్ ద్వారా 45-50 కోట్ల మంది లబ్ది చేకూరుతుందని, హాస్పిటల్ చైన్ ద్వారా టైర్ 2 మరియు టైర్ 3 నగరాల్లో ఆసుపత్రులను ఏర్పాటు చేసే అవకాశాలను మెరుగుపరిచామన్నారు. ఉజ్వలా పథకం ద్వారా ఇప్పుడు ఎనిమిది కోట్ల మహిళలకు ఉచిత వంట గ్యాస్ అందించేలా కొత్త లక్ష్యం పెట్టుకున్నామని ప్రధాని చెప్పారు. ఎప్పుడైతే ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయో... దేశం అర్థికాభివృద్దిలో పుంజుకుటుందని చెప్పారు.


గత మూడున్నర సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం అనేక ఆర్థిక సంస్కరణలను చేపట్టిందని, వ్యాపారం కోసం విధానాలను సరళీకృతం చేసిందని చెప్పారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో భారత్ లో ఎఫ్డిఐల ద్వారా 60 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని గుర్తుచేశారు.



ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు, అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ ముఖ్యమంత్రులు, 16 దేశాల రాయబారులు, హై కమిషనర్లు, ఆర్ఐఎల్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తదితరులు పాల్గొన్నారు.