కర్ణాటకలో భారతీయ జనతా పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నది. మంగళవారం సాయంత్రం గవర్నర్‌ వాజుభాయ్‌ వాలా 104 మంది సభ్యులతో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకే ప్రభుత్వ ఏర్పాటుకు తొలి అవకాశం ఇచ్చారు. ఈ మేరకు ఆ పార్టీ శాసనసభాపక్ష నేత బీఎస్‌ యడ్యూరప్పను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. బలనిరూపణకు 15 రోజులు గడువు ఇచ్చారు. మద్దతు నిరూపించుకున్న తర్వాత మంత్రివర్గ ప్రమాణస్వీకారం ఉంటుందని కొత్తమంత్రులతో గవర్నర్‌ ప్రమాణ స్వీకారం చేయిస్తారని విశ్లేషకుల సమాచారం. న్యాయనిపుణులతో సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత వాజుభాయ్‌ వాలా తుదినిర్ణయం వెల్లడించినట్లు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నేడు ఉదయం 9:30గంటలకు బూకనకెరె సిద్దలింగప్ప యెడ్యూరప్ప 23వ కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. యడ్యూరప్ప మాత్రమే నేడు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌ నుంచి ఆహ్వానం రావడంతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. రాజ్‌భవన్‌లో జరగనున్న ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో పాటు పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలిసింది.