బాబా రామ్‌దేవ్ ఈ రోజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. "పెట్రోల్ ధరలు తగ్గించాలంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి. ప్రభుత్వం నాకు అవకాశమిస్తే నేను లీటర్ పెట్రోల్‌ను రూ.35 నుండి రూ.40లకు అమ్మగలను. అయితే.. ప్రభుత్వం  కొంత ట్యాక్స్ తగ్గించాలి" అని ఆయన ఓ ప్రముఖ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. పెట్రోల్‌ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి.. అయితే దానిని 28 శాతం రేటు విభాగంలోకి తీసుకురాకూడదు" అని రామ్‌దేవ్ తెలిపారు. మోదీ ప్రభుత్వం తమ హయాంలో కొన్ని మంచి పనులు చేసినప్పటికీ.. ఇంకా కొన్ని విషయాల్లో ప్రజలకు సంశయాలు ఉన్నాయని ఆయన అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పెట్రోల్ ధరలను తగ్గించే విషయంలో ప్రభుత్వం పట్టించుకోకపోతే.. ప్రజల వల్ల ప్రభుత్వానికి తీరని నష్టం జరుగుతుందని బాబా రామ్‌దేవ్ అభిప్రాయపడ్డారు. తాను ఏ రాజకీయ పార్టీ తరఫునా మాట్లాడడం లేదని.. ఏ పార్టీ అయినా మంచి చేయాలనే భావిస్తానని రామ్‌దేవ్ తెలిపారు. తనను అందరూ సైంటిఫిక్ సన్యాసి అని పిలుస్తారని.. ఎందుకంటే పతంజలి గ్రూపులో 300 మంది సైంటిస్టులకు తాను అవకాశం కల్పించానని రామ్‌దేవ్ అన్నారు.


అలాగే నిరుద్యోగ సమస్యపై కూడా రామ్‌దేవ్ స్పందించారు. యువత తమకు అవకాశం దక్కడం లేదని అనుకుంటూ ఉంటారని.. కానీ అది నిజం కాదని.. తనకు మాత్రం గాడ్ ఫాదర్స్ ఎవరూ లేరని.. అయితే తాను పతంజలి లాంటి పెద్ద సంస్థకు రూపకల్పన చేశానని రామ్‌దేవ్ అన్నారు. తాను డబ్బు వెంట పరుగెత్తనని.. డబ్బే తన వెనుక పరుగెడుతూ ఉంటుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. అలాగే గోవును మతపరమైన జంతువుగా భావించవద్దని.. గోవులకు మతాలకు సంబంధం లేదని రామ్‌దేవ్ తెలిపారు.