Balasore Train Accident Case: సంచలనం సృష్టించిన కోరమండల్ రైలు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాలాసోర్ వద్ద రైలు ప్రమాదం ఘటనకు సంబంధించి శుక్రవారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ముగ్గురుని అదుపులోకి తీసుకుంది. సీబీఐ అదుపులోకి తీసుకున్న ముగ్గురు కూడా రైల్వే ఉద్యోగులే కావడం గమనార్హం. ఒడిషా రైలు ప్రమాదం దుర్ఘటనలో 250 మందికి పైగా రైలు ప్రయాణికులు దుర్మరణంపాలైన సంగతి తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాలాసోర్ రైలు ప్రమాదం కేసులో అరెస్ట్ అయిన నిందితుల్లో సీనియర్ సెక్షన్ ఇంజనీర్ అరుణ్ కుమార్, జూనియర్ సెక్షన్ ఇంజనీర్ మహమ్మద్ అమీర్ ఖాన్, టెక్నీషియన్ పపూ కుమార్ ఉన్నారు. అరెస్ట్ అయిన ముగ్గురిపై ఐపిసి సెక్షన్ 304 కింద కేసు నమోదు చేసినట్టు సీబీఐ అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా తమ నేరాన్నికప్పిపుచ్చుకునేందుకు సాక్ష్యాధారాలు మాయం చేసినందుకు వారిపై ఐపీసీ సెక్షన్ 201 కింద సైతం కేసు నమోదు చేసినట్టు సీబీఐ అధికారులు తెలిపారు. 


ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని వందలు, వేల కుటుంబాల్లో చీకటిని నింపిన ఈ ఘోర ప్రమాదంపై అనేక రకాల వార్తలొచ్చాయి. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగింది అని కొందరు వాదిస్తే.. ఈ దుర్ఘటన వెనుక కుట్ర కోణం ఉన్నట్టు ఇండియన్ రైల్వే అనుమానాలు వ్యక్తంచేసింది. విభిన్న వాదనల మధ్య జూన్ 6వ తేదీన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ కేసు విచారణ చేపట్టింది. కేసును తమ చేతుల్లోకి తీసుకున్న తరువాత సరిగ్గా నెల రోజుల అనంతరం ముగ్గురు రైల్వే ఉద్యోగులను సీబీఐ అదుపులోకి తీసుకోవడం గమనార్హం.


జూన్ 2న జరిగిన ఒడిషా రైలు ప్రమాదం దుర్ఘటన యావత్ దేశాన్ని తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాదంలో 278 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 1100 మందికిపైగా రైలు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.