గవర్నర్‌గా నియామకంపై స్పందించిన బండారు దత్తాత్రేయ
గవర్నర్‌గా నియామకంపై స్పందించిన బండారు దత్తాత్రేయ
హైదరాబాద్: తనను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమించిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కేంద్ర మాజీ మంత్రి, బీజేపి అగ్రనేత బండారు దత్తాత్రేయ కృతజ్ఞతలు తెలిపారు. గవర్నర్‌గా తనపై ఉంచిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని, రాజ్యాంగానికి లోబడి నడుచుకుంటానని దత్తాత్రేయ అన్నారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన వెంటనే మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
దివంగత మాజీ ప్రధాని ఎబి వాజ్‌పేయి కేబినెట్‌లో పట్టణాభివృద్ధి శాఖ, రైల్వే శాఖలకు సహాయ మంత్రిగా సేవలు అందించిన దత్తాత్రేయ ఆ తర్వాత నరేంద్ర మోదీ తొలిసారిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన కేబినెట్‌లోనూ సహాయ మంత్రిగా చోటు దక్కించుకున్నారు. బండారు దత్తాత్రేయ మొదటి నుంచీ పోటీ చేస్తూ వస్తోన్న సికింద్రాబాద్ లోక్ సభ స్థానాన్ని 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో జి కిషన్ రెడ్డికి కేటాయించారు. అక్కడి నుంచి లోక్ సభకు ఎన్నికైన కిషన్ రెడ్డి సైతం మోదీ 2.0 కేబినెట్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాథ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.