Bank Employee Strike: నేటి నుంచి 3 రోజులు బ్యాంకులు బంద్
Bank strike On January 31: తమ డిమాండ్లను నెరవేర్చలేదని బ్యాంకు ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. రెండు రోజుల పాటు బ్యాంకుల బంద్కు బ్యాంక్ ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. తద్వారా మూడు రోజుల పాటు బ్యాంక్ సర్వీసులు అందుబాటులో ఉండవు.
వేతన సమస్య పరిష్కరించాలని కోరుతూ ద యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) శుక్రవారం (జనవరి 31) నుంచి రెండు రోజులపాటు దేశవ్యాప్తంగా బ్యాంకు సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో శనివారం కూడా బ్యాంకులు పనిచేయవు. ఆ మరుసటి రోజు ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజులపాటు బ్యాంకు సేవలు ఖాతాదారులకు అందుబాటులో ఉండవు. నవంబర్ 1, 2017 నుంచి వేతన పెంపు కోసం ఎదురుచూసినా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఈ డిమాండ్ అంగీకరించడం లేదు.
ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని 10 లక్షల మంది బ్యాంకర్లు తమ పనిని బహిష్కరించాలని నిర్ణయించారు. ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ (ఐబీఏ)తో సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోని కారణంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. ‘ద యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్, ఐబీఏ నెగోషియేటింగ్ కమిటీ పలుమార్లు చర్చలు జరిపాయి. చివరగా జనవరి 30న జరిగిన సమావేశంలో పనితీరు అనుసంధాన ప్రోత్సాహకంతో కలిపి 19%పెంపు చేస్తున్నట్లు నిర్ణయించారు. దురదృష్టవశాత్తు బ్యాంకు ఉద్యోగులు సమ్మెబాట పట్టారు.
వారి డిమాండ్లలో ఒకటైన ఐదు రోజుల పనివేళలు అమలు చేయడం అంత తేలిక కాదు. దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్న తరుణంలో ఉద్యోగులు ఈ డిమాండ్లు తీసుకొచ్చారు. మన దేశంలో ఇప్పటికే చాలా పబ్లిక్ హాలీడేస్ ఉన్నాయి. వీటికి మరో 26 రోజులు కలిపితే ప్రజలతో పాటు ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని’ ఐబీఏ ఓ ప్రకటనలో తెలిపింది.