జనాలకు మళ్లీ కరెన్సీ కష్టాలు తప్పేలా లేవు..! ఇప్పటికే నగదు కొరతతో ప్రజలు ఇబ్బందిపడుతున్న నేపథ్యంలో బ్యాంకులకు వరుస సెలవులు వచ్చిపడ్డాయి. కొన్ని రాష్ట్రాల్లో నేటి నుంచి నాలుగు రోజులపాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఏప్రిల్ 28వ తేదీన నాలుగో శనివారం, 29 ఆదివారం, 30 బుద్ధ పూర్ణిమ, మే 1 కార్మిక దినోత్సవంతో ఈ సెలవులను పాటిస్తున్నాయి.


అయితే తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో బ్యాంకులు సోమవారం పనిచేయనున్నాయి. అయితే మంగళవారం మేడే కారణంగా సెలవు కాబట్టి ఆ రోజు సెలవుగా చెప్పుకోవచ్చు. మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో మాత్రం నాలుగు రోజులు బ్యాంకులకు సెలవే. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో నగదు కొరత ఉన్నసంగతి తెలిసిందే. కాగా ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏటీఎంలలో నగదు నింపుతామని, ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు సెలవురోజుల్లోనూ యధావిధిగా కొనసాగుతాయని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.