ఈ రోజు ఢిల్లీకి రానున్న బరాక్ ఒబామా
ఢిల్లీలోని టౌన్ హాల్‌లో జరగబోయే ఒబామా ఫౌండేషన్ సమావేశానికి హాజరవడానికి వస్తున్న ఒబామా, ఈ సందర్భంగా దాదాపు 280 యువ ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ రోజు భారత రాజధాని ఢిల్లీ నగరానికి రానున్నారు. ఈ సందర్భంగా ఆయన భారత ప్రధాని నరేంద్ర మోదీతో కొంతసేపు భేటీ కానున్నారు. ఢిల్లీలోని టౌన్ హాల్‌లో జరగబోయే ఒబామా ఫౌండేషన్ సమావేశానికి హాజరవడానికి వస్తున్న ఒబామా, ఈ సందర్భంగా దాదాపు 280 యువ ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3.45 గంటలకు ఆయన వస్తున్నట్లు సమాచారం.
యువ నాయకులు ఎలాంటి విషయాల పట్ల అవగాహన పెంచుకోవాలో.. మంచి పౌరులుగా ఎదగడానికి ఎలాంటి అంశాలపై దృష్టి కేంద్రీకరించాలన్న అంశాలపై ఒబామా ఫౌండేషన్ ఈ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం విశేషం. ముఖ్యంగా, సమావేశానికి హాజరవడానికే ఒబామా భారత్ వస్తున్నా.. కొంత సమయం కేటాయించి ప్రధాని మోదీని కూడా కలవనున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు నాయకులు ఇప్పటికి దాదాపు ఎనిమిది సార్లు కలిశారు. జనవరి 2015 నెలలో ఒబామా ఆఖరి సారి భారత్‌ను సందర్శించారు. రిపబ్లిక్ డే ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఆయన అప్పుడు హాజరయ్యారు.