ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యహు భారత పర్యటనలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలో ఆయన తన గౌరవార్థం బాలీవుడ్ ప్రముఖులు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారతీయ చిత్ర పరిశ్రమను కొనియాడారు. భారత్‌తో ఉన్న స్నేహాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా తాను ప్రయత్నిస్తానని.. ఇజ్రాయెల్‌లో షూటింగ్ జరుపుకోవాలని భావించే భారతీయ చిత్ర ప్రముఖులకు సాదర ఆహ్వానమని ఆయన తెలిపారు. "ఈ రోజు మన ఇరు దేశాల స్నేహబంధాన్ని కొన్ని మిలియన్ల ప్రజలు వీక్షిస్తున్నారు.


నన్ను ఆహ్వానించినందుకు బాలీవుడ్‌కి ధన్యవాదాలు. జై హింద్.. జై మహారాష్ట్ర.. జై ఇజ్రాయెల్" అని చెబుతూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు. ఆ కార్యక్రమం తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బాలీవుడ్ నటులతో కొంచెంసేపు మాట్లాడారు. అమితాబ్ బచ్చన్, కరణ్ జోహార్, వివేక్ ఒబెరాయ్, ఇమ్తియాజ్ అలీ మొదలైన బాలీవుడ్ ప్రముఖులను మర్యాద పూర్వకంగా కలిశారు.ఇటీవలే భారత సందర్శనకు వచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యహును భారత ప్రధానే స్వయంగా ప్రోటోకాల్ పక్కన పెట్టి వెళ్లి ఆహ్వానించడం గమనార్హం. నెతన్యహు తన భారత పర్యటనలో భాగంగా ముంబయిలో నివాసముంటున్న యూదు జనాభాను ఉద్దేశించి కూడా ప్రసంగించారు. పలువురు సీఈఓలతో కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యారు.