న్యూఢిల్లీ: విద్య, ఉద్యోగ రంగాల్లో కుల ఆధారిత రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కొన్ని సంస్థలు మంగళవారం ‘భారత్‌ బంద్‌’కు పిలుపునిచ్చాయి. భారత్ బంద్ పిలుపును దృష్టిలో ఉంచుకుని భద్రతను కట్టుదిట్టం చేయాలని అన్ని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను హోంశాఖ మంత్రిత్వశాఖ ఆదేశించింది. హింసాకాండ, ఆస్తి నష్టాలను నివారించేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేయాలని  హోంమంత్రిత్వశాఖ సోమవారం, ఒకరోజు ముందే విజ్ఞప్తి చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎక్కడైనా శాంతిభద్రతలకు భంగం వాటిల్లితే ఆ ప్రాంతానికి చెందిన కలెక్టర్, ఎస్పీలు వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. నేటి భారత్ బంద్‌లో శాంతిభద్రతలను పర్యవేక్షించే క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని అన్ని జిల్లా పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటానికి భద్రతాదళాలు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.


ఏప్రిల్ 2న జరిగిన భారత్ బంద్‌లో హింస చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ముందస్తు చర్యగా రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం జైపూర్, ఆళ్వార్‌లలో ఇంటర్నెట్ సేవలను సస్పెండ్ చేసింది.  ఏప్రిల్ 10 తేదిన భారత్ బంద్ జరుగుతున్న దృష్ట్యా  జైపూర్, ఆళ్వార్‌, భోపాల్‌లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని అక్కడి పోలీసు అధికారులు తెలిపారు.


ఎస్సీ,ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంపై సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ ఇటీవల దళిత సంఘాలు నిర్వహించిన 'భారత్‌ బంద్‌' హింసాత్మకంగా మారడం వలన మధ్యప్రదేశ్‌లో ఆరుగురు, రాజస్థాన్‌లో ఇకరు, ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు మరణించడం తెల్సిందే. సోషల్‌ మీడియాల్లో కొన్ని సంస్థలు కుల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మంగళవారం బంద్‌కు పిలుపు నిచ్చాయని హోంశాఖ ఉన్నతాధికారి చెప్పారు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంపై  సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే.