'భారత్ బంద్' హింసాత్మకంగా మారింది. దేశంలో చాలాచోట్ల నిరసనకారుల ఆందోళనలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పలుచోట్ల నిరసనకారులు ఆస్తుల విధ్వంసానికి దిగారు. ర్యాలీలు నిర్వహించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌కు 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొరెనాలో ఘర్షణల కారణంగా ఓ వ్యక్తి మరణించారు.  బంద్‌లో భాగంగా దళిత సంఘాలు నిరసనలు చేపట్టారు. ఈ సమయంలో దళిత సంఘాలకు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.


ఈ  సమయంలో రాహుల్ పాథక్ అనే వ్యక్తి తన ఇంటిలోని బాల్కనీలో నిలబడి ఉన్నాడు. ఆందోళన సమయంలో, పోలీసులు కాల్పులు జరిపారు. ఆ సమయంలో బుల్లెట్ రాహుల్ శరీరంలో దూసుకెళ్లింది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించే మార్గంలో రాహుల్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో మొరెనాలో కర్ఫ్యూ విధించబడింది.






 


ఇలాగే దేశంలో ఇతర ప్రాంతాల్లో కూడా హింస చెలరేగింది. ఆగ్రాలో నిరసనకారులు తెరిచిఉన్న షాప్‌లపై దాడులుచేసి.. ధ్వంసం చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని లాఠీచార్జ్‌ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. పంజాబ్‌, బీహార్ రాష్ట్రాలలో దళిత సంఘాలు రోడ్డెక్కాయి. నిరసనల్లో భాగంగా రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. పట్టాలపై కూర్చొని నిరసన తెలిపారు. ప్రధాన రహదారులపై బైఠాయించి వాహనాల రాకపోకలను స్తంభింపజేశారు.


బంద్‌ సందర్భంగా జార్ఖండ్‌ రాజధాని రాంచీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తరప్రదేశ్‌ మీరట్‌లో నిరసన కారులు కార్లు, బస్సులను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు నిరసనకారులతోపాటు రోడ్డుపై దొరికిన వారిని దొరికినట్టు చితకబాదారు. మధ్యప్రదేశ్‌ భింద్‌లోనూ పెద్దసంఖ్యలో గుమిగూడిన నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో ఇక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.