పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలకు నిరసనగా సెప్టెంబర్ 10 సోమవారం నాడు 'భారత్‌ బంద్‌'కు కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం తలపెట్టిన భారత్ బంద్‌లో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కాంగ్రెస్‌ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించే ఒక్క రోజు భారత్ బంద్‌కు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, విద్యార్థిలోకం పెద్దఎత్తున పాల్గొని మద్దతు ప్రకటించి కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని నేతలు కోరారు. అటు కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన భారత్ బంద్‌కు వామపక్ష పార్టీలతో సహా ఇతర రాజకీయ పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. డీఎంకే, మహా రాష్ట్ర నవనిర్మాణ సేన, ఆర్జేడీ, జేడీ(ఎస్) వంటి పార్టీలు మద్దతు ఇచ్చాయి. లెఫ్ట్,కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బంద్ కావడంతో పశ్చిమ బెంగాల్‌లో 'భారత్ బంద్'కు దూరంగా ఉండాలని టీఎంసీ ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒడిశా, బెంగళూరులో సెప్టెంబర్ 10న పాఠశాలలకు సెలవు


భారత్ బంద్ దృష్ట్యా..ఒడిశా రాష్ట్రంలో సోమవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలకు నిరసనగా భారత్‌ బంద్‌కు కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కర్ణాటకలోని బెంగళూరులో కూడా అనేక స్కూళ్లు, కాలేజీలకు సోమవారం సెలవు ప్రకటించారు. ఉదయం 9 నుండి మధ్యాహ్నం 3 వరకు కాంగ్రెస్ తలపెట్టిన బంద్ కారణంగా రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని.. అందుకే సెలవులు ప్రకటిస్తున్నట్లు ఆయా పాఠశాల, కళాశాల యాజమాన్యాలు పేర్కొన్నాయి. అయితే మెట్రో సర్వీసులు యథావిధిగా నడుస్తాయని బెంగళూరు మెట్రో అధికారులు తెలిపారు.


సోమవారం భారత్‌ బంద్ సందర్భంగా.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా బంద్ ప్రభావం కనిపించనుంది. ఇప్పటికి వరకు అందిన సమాచారం ప్రకారం.. ఇరు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. మరికొన్ని స్కూళ్లు, కాలేజీలు సోమవారం నాటి బంద్ ప్రభావాన్ని అంచనా వేసి సెలవు ప్రకటించనున్నారు. కాగా.. రేపటి బంద్‌లో ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొంటుండగా.. తెలంగాణలో టీఆర్ఎస్ తప్ప మిగితా రాజకీయ పార్టీలు బంద్‌లో పాల్గొంటాయని సమాచారం.