న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలను చేస్తున్నారని ఆరోపిస్తూ దళిత సంఘాలు సోమవారం 'భారత్‌ బంద్‌'కు పిలుపునిచ్చారు. సంవిధాన్‌ బచావో సంఘర్ష్‌ కమిటీ ఇచ్చిన పిలుపును ఆలిండియా ఆది ధర్మ మిషన్‌, ఆలిండియా ఆది ధర్మ సాధు సమాజ్‌ స్వాగతించి బంద్‌కు సంఘీభావం తెలిపాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని సారంగపూర్‌లోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేయనున్నట్టు రాష్ట్రీయదళిత్‌ అధికార్‌ మంచ్‌ నేత, గుజరాత్‌ ఎమ్మెల్యే జిగేశ్‌ మేవాని ప్రకటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బంద్‌ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, సుప్రీంలో రివ్యూ పిటిషన్‌ను సోమవారం వేయనున్నట్టు కేంద్ర సాంఘిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి థావర్‌చంద్‌ గెహ్లాట్‌ దళిత సంఘాలను కోరారు. కాగా గత నెలలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసుల్లో చాలా వరకు బూటకపు కేసులు ఉంటున్నాయని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ అధికారులపై ఈ చట్టం ప్రకారం కేసు నమోదైన పక్షంలో వారిని అరెస్టు చేయాలంటే ముందుగా ఉన్నతాధికారుల అనుమతి అవసరమని చెప్పింది. ఇలాంటి కేసుల్లో డీఎస్పీ స్థాయి అధికారి దర్యాప్తు తప్పనిసరి అని పేర్కొనటంతో పాటు రూలింగ్‌ ఇవ్వటంపై.. ఎస్సీ, ఎస్టీ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.



 


సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా


మరోవైపు.. బంద్‌ నేపథ్యంలో సోమవారం విద్యాసంస్థలకు పంజాబ్‌ సర్కారు సెలవు ప్రకటించింది. నేడు జరిగే 10వ తరగతి, 12వ తరగతి సీబీఎస్ఈ పరీక్షలను వాయిదా వేసింది. ఆర్టీసీ బస్సులను రద్దు చేసింది. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు మిలటరీని పంపాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కరణ్‌ సింగ్‌ కేంద్రానికి లేఖ రాశారు.