భరూచ్: Bharuch blast గుజరాత్‌లోని భరూచ్‌లో ఓ రసాయన కర్మాగారంలో బుధవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా పరిశ్రమలో భారీ ఎత్తున మంటలు అంటుకున్నాయి( Fire brokeout). ఈ భారీ అగ్ని ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు మరణించగా అనేక మంది గాయపడ్డారు. భరుచ్ జిల్లాలోని దహేజ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని యశశ్వి రసాయన్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ( Yashashvi rayasan pvt ltd ) ఈ పేలుడు చోటుచేసుకుంది. పెద్ద పేలుడు తర్వాత కర్మాగారం నుండి ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో పరిశ్రమ పరిసరాలన్నింటినీ దట్టమైన పొగ కప్పేసింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను జిల్లా కేంద్రంలోని ఆసుపత్రులలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. 12 ఫైర్ ఇంజిన్స్ కొన్ని గంటలపాటు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రసాయన పరిశ్రమలో పేలుడు ఘటనపై భారుచ్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎండి మోడియా ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. "ఈ రోజు మధ్యాహ్నం యశశ్వి రసాయన్ ప్రైవేట్ లిమిటెడ్ వద్ద ట్యాంక్ పేలుడు సంభవించిన కారణంగా అగ్ని ప్రమాదం చెలరేగిందని.. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించాం'' అని తెలిపారు. 


పేలుడు జరిగిన పరిశ్రమకు సమీపంలోనే ప్రమాదకరమైన రసాయనిక పరిశ్రమలు ఇంకొన్ని ఉన్న నేపథ్యంలో పరిశ్రమకు సమీపంలోని లఖీ, లువారా గ్రామాల ప్రజలను తాత్కాలికంగా అక్కడి నుంచి ఖాళీ చేయించినట్టు కలెక్టర్ వెల్లడించారు.