Bihar Political Crisis: ఊహించిందే జరిగింది.. ఎన్డీఏకి నితీశ్ గుడ్‌బై.. గవర్నర్‌కు రాజీనామా.సమర్పణ, కుప్పకూలిన బీహార్ ప్రభుత్వం
Bihar Political Crisis: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బీజేపీకి బిగ్ షాకిచ్చారు. అంతా భావించినట్లుగానే ఎన్డీఏ కూటమిని వీడటమే కాకుండా..ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో రెండేళ్ల సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది.
Bihar Political Crisis: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బీజేపీకి బిగ్ షాకిచ్చారు. అంతా భావించినట్లుగానే ఎన్డీఏ కూటమిని వీడారు నితీశ్ కుమార్. ఇవాళ జేడీయూ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాట్నాలో నిర్వహించిన సమావేశంలో బీజేపీతో తెగదెంపులపై నిర్ణయం తీసుకున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తో కలిసి బీహార్ గవర్నర్ చౌహాన్‌ను కలిశారు. రాజీనామా లేఖ సమర్పించారు. ఫలితంగా రెండేళ్ల సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది.
నితీశ్ రాజీనామా చేయడంతో తదుపరి పరిణామాలు, బీహార్ రాజకీయం ఏ మలుపు తిరుగుతుందోననే ఆసక్తి నెలకొంది. అటు ఆర్జేడీ కూడా ఇవాళ తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో భేటీ నిర్వహించింది. నితీశ్ ఎన్డీయేకి కటీఫ్ చెప్పడంతో మరోసారి ఆయనతో చేతులు కలిపేందుకు ఆర్జేడీ ఆసక్తి చూపుతోంది. ఇదే విషయాన్ని నితీశ్ రాజీనామా తర్వాత ఆర్జేడీ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. ఇప్పటికే ఆర్జేడీ సీనియర్ నేత శివానంద్ తివారీ.. జేడీయూతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. అటు వామపక్షాలు కూడా నితీశ్‌తో మళ్లీ జతకట్టేందుకు సిద్ధమని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో బీహార్‌లో మరోసారి మహాకూటమి ప్రభుత్వం ఏర్పడబోతుందా అనే చర్చ జరుగుతోంది.
నితీశ్ కుమార్ ఎన్డీఏని వీడటం ఇది రెండోసారి :
బీహార్‌లో 2005 నుంచి 2013 వరకు బీజేపీ, జేడీయూ పొత్తు కొనసాగింది. బీజేపీ మద్దతుతో నితీశ్ రెండుసార్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. 2013లో ఎన్డీయేని వీడిన నితీశ్ కుమార్ 2015లో ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలిసి మహాకూటమి ఏర్పాటు చేశారు. కానీ మహాకూటమిలో రెండేళ్లకే చీలిక వచ్చింది. తిరిగి 2017లో నితీశ్ మళ్లీ ఎన్డీయేతో జతకట్టారు. 2020లో బీజేపీతో కలిసే ఎన్నికల్లో పోటీ చేశారు. గతంలో ఎప్పుడూ జేడీయూ కన్నా ఎక్కువ సీట్లు సాధించని బీజేపీ.. ఈసారి ఆ పార్టీ కన్నా ఎక్కువ సీట్లు సాధించింది. అయినప్పటికీ నితీశ్ కుమార్‌కే సీఎం సీటును ఆఫర్ చేసింది.
బీజేపీతో తెగదెంపులకు కారణమిదే :
గత కొన్నాళ్లుగా బీజేపీ తీరు పట్ల నితీశ్‌లో అసంతృప్తి రాజుకుంది. కేంద్ర కేబినెట్‌లో జేడీయూకి రెండు బెర్తులు ఇవ్వాలని నితీశ్ కేంద్రాన్ని కోరగా కేవలం ఒకరికే అవకాశం కల్పించారు. అది కూడా నితీశ్‌ను సంప్రదించకుండానే జేడీయూ నేత ఆర్‌సీపీ సింగ్‌ను కేంద్రమంత్రిని చేశారు. తమ పార్టీలో ఎవరిని కేంద్రమంత్రిని చేయాలనేది కూడా అమిత్ షానే నిర్ణయించడం నితీశ్ అవమానంగా భావించారు. ఈ క్రమంలో ఆర్‌సీపీ సింగ్‌కి నితీశ్ మరోసారి రాజ్యసభ అవకాశం కల్పించలేదు. పైగా ఆర్‌సీపీ సింగ్ బీజేపీ నేతలతోనే ఎక్కువ సఖ్యతగా మెలగడం ఆయనకు నచ్చలేదు. ఈ పరిణామాలన్నీ నితీశ్‌కు మహారాష్ట్ర రాజకీయాన్ని తలపించాయి. జేడీయూని చీల్చేందుకు బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందనే నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇక బీజేపీతో మిత్ర బంధాన్ని తెగదెంపులు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఎన్ డీఏ నుంచి బయటికొస్తే మద్దతిస్తామని ఆర్జేడీ, కాంగ్రెస్ చెప్పడంతో ఏం జరుగుతుందనేది ఆసక్తి రేపుతోంది.
Also Read: Optical Illusion: మీ ఐక్యూకి ఇది ఛాలెంజ్.. 30 సెకన్లలో ఈ చిత్రంలో దాగున్న పిల్లిని గుర్తుపట్టండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook