బీజేపీ నాయకుడు సూరజ్ పాల్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాజపుత్ సంఘాలు వద్దని చెబుతున్నా, విడుదలకు సిద్ధమవుతున్న "పద్మావతి" చిత్రాన్ని బెంగాల్ ప్రాంతంలో రిలీజ్ చేసుకోవచ్చని చెబుతున్న మమత కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలని తెలిపారు. "కొందరు మహిళలకు రామాయణంలో శూర్ఫణకకు ఉన్నంత క్రూరత్వమైన ఆలోచనలు ఉన్నాయి. అలాంటి క్రూరురాలైన శూర్ఫణక ముక్కును కోసి లక్ష్మణుడు ఆమెకు తగిన గుణపాఠమే నేర్పాడు. ఈ విషయాన్ని మమతాజీ గుర్తుపెట్టుకుంటే చాలు" అని పాల్ వ్యాఖ్యలు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుక్రవారం మమతా బెనర్జీ మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్‌లో "పద్మావతి" చిత్రాన్ని విడుదల చేస్తే, తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, మిగతా రాష్ట్రాల్లో కాకపోతే నిర్మాతలు బెంగాల్ ప్రాంతంలో చిత్రం విడుదల చేసుకోవచ్చని ఆమె తెలిపారు. అందుకోసం వీలైతే తమ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుందని కూడా మమత తెలిపారు.


ఇప్పటికే పద్మావతి చిత్రంపై పలు విమర్శలు వస్తున్న క్రమంలో మమతా బెనర్జీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దుమారం లేపింది. ఇప్పటికే రాజపుత్ర కర్ణిసేన పద్మావతి చిత్ర విడుదలను అడ్డుకుంటామని ప్రకటించింది.పలు రాజపుత్ర సంఘాలు కూడా ఈ చిత్రంలో పద్మావతిని కించపరిచే సన్నివేశాలు ఉంటే... సహించేది లేదని తెగేసి చెప్పాయి. ఇలాంటి సమయంలో మమతా బెనర్జీ ఆ చిత్రాన్ని సమర్థిస్తూ మాట్లాడడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.