గోవాలో బీఫ్ బ్యాన్ చేయవద్దు: బీజేపీ ఎమ్మెల్యే
గోవా పర్యాటకంగా బాగా అభివృద్ది చెందుతున్న ప్రదేశమని.. ఈ ప్రాంతంలో బీఫ్ తినేవారు అధికంగా ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే మైఖేల్ లోబో తెలిపారు.
గోవా పర్యాటకంగా బాగా అభివృద్ది చెందుతున్న ప్రదేశమని.. ఈ ప్రాంతంలో బీఫ్ తినేవారు అధికంగా ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే మైఖేల్ లోబో తెలిపారు. గోవా ప్రాంత ప్రజల ఆహారపు అలవాట్లను పరిగణనలోకి తీసుకొని గోవాలో బీఫ్ బ్యాన్ చేయకూడదని ఆయన అన్నారు. గోవాలో మాంసాన్ని సరఫరా చేసే కాంప్లెక్స్‌ను మూసివేశారని.. అలాగే గోరక్షకులు సరిహద్దు ప్రాంతాల్లోకి బీఫ్ తీసుకురావడాన్ని అడ్డుకుంటున్నారని లోబో తెలిపారు.
గోవాలో మీట్ కాంప్లెక్స్ మరల ప్రారంభించడానికి అనుమతి ఇవ్వాలని.. బీఫ్ వంటకాలు వండేందుకు హోటళ్లకు కూడా అనుమతి ఇవ్వాలని.. ఇప్పటికే బీఫ్ వాడకం తగ్గడం వల్ల రాష్ట్ర పర్యాటక రంగం నష్టాల బాటలో పయనిస్తుందని ఆయన తెలిపారు. గోవాలో మళ్లీ మీట్ కాంప్లెక్స్ ప్రారంభిస్తే.. గోరక్షకులు అడ్డుకుంటారో లేదో తెలపాలని ఆయన అన్నారు. తాను గోరక్షకుల పట్ల అపారమైన గౌరవం కలిగి ఉన్నానని.. కాకపోతే గోవాలో అత్యధిక ప్రజలు తినే బీఫ్‌ను నిషేధించకూడదని లోబో అభిప్రాయపడ్డారు. బీఫ్ పై నియంత్రణ విధించడం వల్ల రాష్ట్ర ఆదాయానికి కూడా గండి పడిందని ఆయన అన్నారు.
కర్ణాటక, మహారాష్ట్ర లాంటి ప్రాంతాల నుండి బీఫ్ సరఫరా కాకపోతే.. కనీసం గోవాలో ఉన్న గోవులనైనా సర్టిఫికేషన్ పొందాక వధించేందుకు అనుమతి ఇవ్వాలని మైఖేల్ లోబో తెలిపారు. చాలా మంది యాత్రికులు కూడా గోవాలో బీఫ్ రుచి చూడడానికే వస్తుంటారని కూడా ఈ బీజేపీ ఎమ్మెల్యే తెలిపారు.