వాజ్‌పేయి పార్థివదేహానికి నివాళి అర్పించేందుకు వస్తున్న ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు, నేతల రద్దీ పెరుగుతుండటంతో అంతిమయాత్రకు తరలించే ఏర్పాట్లలో భాగంగా బీజేపీ అగ్రనేతలు పార్టీ కార్యాలయం గేట్లు మూసేశారు. ఇప్పటికే లోపలికి ప్రవేశించి ఉన్న వారికి మాత్రమే నివాళి అర్పించేందుకు అనుమతి ఇస్తున్నారు. లోపల ఉన్న వారు నివాళి అర్పించడం పూర్తయిన అనంతరం వాజ్‌పేయి పార్థివదేహాన్ని అంతిమయాత్రకు తరలించనున్నారు. వాస్తవానికి ముందస్తుగా చేసుకున్న ఏర్పాట్ల ప్రకారం అంతిమయాత్ర మధ్యాహ్నం 1 గంటకే ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, నివాళి అర్పించేందుకు వస్తోన్న ప్రముఖులు, నేతలు, పార్టీ కార్యకర్తలు, అభిమానుల రద్దీ అధికంగా ఉండటంతో మధ్యాహ్నం 1:45 గంటల వరకు గేట్లు తెరిచే ఉంచారు. అయితే, ఇంకా ఆలస్యం చేస్తే, అంతిమ సంస్కారాలు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందనే ఉద్దేశంతో బీజేపీ గేట్లు మూసేసిందని తెలుస్తోంది. 


అంతిమయాత్ర అనంతరం నేటి సాయంత్రం 4 గంటలకు రాష్ట్రీయ్ స్మృతి స్థల్‌లో మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయి పార్థివదేహానికి అంతిమ సంస్కారాలు జరగనున్నాయి.