కాళ్లు విరగ్గొడతా: దివ్యాంగుడిని హెచ్చరించిన కేంద్ర మంత్రి
కాళ్లు విరగ్గొడతా: దివ్యాంగుడిని హెచ్చరించిన కేంద్ర మంత్రి
కేంద్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు బాబుల్ సుప్రియో దివ్యాంగుడి కాళ్లు విరగ్గొడతానంటూ హెచ్చరించడం వివాదానికి దారి తీసింది. మంగళవారం పశ్చిమ బెంగాల్ ఆసన్సాల్‌లోని నజ్రుల్ మంచ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గాయకుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన బాబుల్ సుప్రియో.. ఆ కార్యక్రమంలో దివ్యంగులను ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నారు.
వేదికమీద బాబుల్ సుప్రియో నిల్చొని ఘన్శ్యామ్ రామ్ అనే వ్యక్తిని సన్మానించారు. ఆ సమయంలో ఓ దివ్యాంగుడు ఆయన ప్రసంగానికి ఆటంకం కలిగించాడు. దీంతో మంత్రికి కోపం వచ్చినట్లుంది.. 'నీకేం జరిగింది? ఏదైనా సమస్యా? నీ కాళ్లు విరగ్గొడతాను' అంటూ వ్యాఖ్యానించారు. అతడ్ని అక్కడి నుంచి మరో పక్కకి వెళ్లి ఉండమని మంత్రి చెప్పారు. 'ఈ కార్యక్రమం నుండి అతడు వెళ్తే అతని ఒక కాలు విరగొట్టండి. నేనేతడికి స్టిక్ ఇస్తాను.' అని అక్కడికి వచ్చిన వారికి ఆయన చెప్పారు. ఒక కేంద్ర మంత్రి దివ్యాంగుడి పట్ల చేసిన ఈ వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపాయి.