న్యూ ఢిల్లీ: స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్ వినియోగించి ఆన్‌లైన్‌లో రైలు టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారా ? అయితే, ఇప్పుడున్న చార్జీలకన్నా రేపటి ఆదివారం నుంచి ఇంకొంత ఎక్కువ మొత్తంలో డబ్బు చెల్లించడానికి సిద్ధంగా ఉండండి. పాత పెద్ద నోట్ల రద్దు(డిమానిటైజేషన్) సమయంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే ఉద్దేశంతో తొలగించిన సర్వీస్ చార్జిలను రేపటి ఆదివారం నుంచి తిరిగి జోడిస్తుండటమే అందుకు కారణం. అప్పట్లో నాన్-ఏసి కోచ్‌లలో ఒక్కో టికెట్‌కి రూ.20, ఏసి కోచ్‌లలో ఒక్కో టికెట్‌కి రూ.40 చార్జి చేసేవారు. కాగా రేపటి నుంచి ఈ చార్జీలు నాన్ ఏసి టికెట్‌కి రూ.15, ఏసి టికెట్‌కి రూ.30 వసూలు చేయనున్నారు. ఈ చార్జీలపై అదనంగా జీఎస్టీ చార్జీలు వర్తిస్తాయని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. 


గతంలో ఐఆర్‌సిటీసి ఆదాయంలో 33 శాతం ఆదాయం ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌పై వసూలు చేసే సర్వీసు చార్జీల రూపంలోనే వచ్చేవి అని రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు.