ఇక నుంచి లంచం తీసుకున్న వారితో పాటు ఇచ్చిన వారు కూడా శిక్షార్హులే. లంచం తీసుకున్న వారితో సమానంగా లంచం ఇచ్చిన వారు ఏడేళ్ల వరకు కారాగార శిక్ష అనుభవించాల్సిందే. ఈ మేరకు అవినీతి నిరోధక చట్టానికి సవరణ చేశారు. కేంద్ర కేబినెట్ చేసిన చట్టసవరణ బిల్లును రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ రోజు ఆమోదముద్ర వేశారు. రాష్ట్రపతి ఆమోదముద్ర తో ఈ చట్టం అమల్లోకి వచ్చినట్లైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతంలో అలా..ఇప్పుడు ఇలా
గతంలో లంచం పుచ్చుకున్న వారికి మూడేళ్ల పాటు జైలు శిక్ష ఉండేది. తాజా సవరణ ప్రకారం ఏడేళ్ల జైలు శిక్ష విధించనున్నారు. గతంలో లంచం ఇచ్చినోళ్లకు ఎలాంటి శిక్ష ఉండేది కాదు.. తాజా సవరణ ప్రకారం లంచం ఇవ్వచూపడం నేరంగా పరిగణించి అలాంటి వారిని కూడా ఏడేళ్ల పాటు శిక్ష విధించే అవకాశముంది. కాగా ఈ చట్టం కింద నమోదు చేసిన కేసుల విచారణను రెండేళ్లలోపు పూర్తి చేయాలి. 


కొందరికీ మినహాయింపు
కాకపోతే ప్రభుత్వ అధికారులు‌, రాజకీయ నేతలు, బ్యాంకర్లలతో పాటు మరికొంత మంది వీవీఐపీలకు కొంత రక్షణ లభించింది. వీరిని దర్యాప్తు సంస్థలు విచారించాలంటే ముందస్తు అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది విశ్రాంత ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది. అయితే లంచం తీసుకొంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన వారిపై దర్యాప్తునకు ఎటువంటి అనుమతులు అవసరం లేదు. 


భిన్న వాదనలు 
తాజా సవరణపై అధికారపక్షం సమర్ధించుకుంటుంటే..ప్రతిపక్షాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. లంచంగొండితనాన్ని పూర్తిగా అరికట్టేందుకే ఇలాంటి చర్యలు తీసుకున్నామని జైట్లీ పేర్కొన్నారు. అలాగే నిజాయితీగా పనిచేసే అధికారులను రక్షించేందుకే ఈ చట్టంలో సవరణలు చేశామన్నారు. కాగా ప్రతిపక్షాలు దీనిపై మరోరకంగా స్పందిస్తున్నాయి. ఈ సవరణ వల్ల ఓరిగేది ఏమి లేదంటున్నాయి. కొండను తవ్వి ఎలుకను బయటికి తీసినట్లుగా ఉందని విమర్శిస్తున్నాయి. నల్లధనం విషయంలోనూ మోడీ సర్కార్ ఇలాంటి ప్రగల్భాలే పలికిందని.. తీరా అమలుకు వచ్చే సరికి శూన్యమే మిగిలిందని.. అవినీతి చట్టసవరణలు చేయడమే కాదు..దీన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.