బరాక్ ఒబామాతో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కానున్నారు. డిసెంబర్ 1వ తేదీన  వీరిద్దరూ భేటీ కానున్నారు. ఒబామా ఢిల్లీలో పర్యటిస్తున్న సమయంలో టౌన్ హాల్ లో సమావేశం నిర్వహిస్తున్నారు. ఒబామా  మాజీ అధ్యక్షుడయ్యాక మొదటి సారి ఈ భేటీ జరుగుతుండటం విశేషం. సెప్టెంబరు 2014 మరియు సెప్టెంబరు 2016 మధ్యకాలంలో మోదీ మరియు ఒబామా ఎనిమిదిసార్లు కలుసుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒబామా జనవరి 2015 లో చివరిసారి ఇండియాకు వచ్చారు. భారత గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడిగా ఒబామా ఖ్యాతిగాంచారు. ఒబామా, మిషెల్ ఒబామా ఇద్దరూ తాజ్ మహల్ ను సందర్శించాలని షెడ్యూల్ లో  పొందుపరిచారు. కానీ.. చివరి క్షణంలో అది రద్దయింది.


భారతదేశాన్ని రెండుసార్లు సందర్శించిన మొట్టమెదటి అమెరికా అధ్యక్షుడు ఒబామాయే. ఈయన మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు 2010 లో భారత్ ను సందర్శించారు. మోదీ జాతినుద్దేశించి మాట్లాడే 'మాన్ కీ బాత్' లో ఒబామా కూడా  పాల్గొనున్నారు.


ఆయన రెండు రోజులపాటు భారత్ లో పర్యటించనున్నారు. అయితే ఈ రెండు రోజుల పర్యటన దిల్లీకే పరిమితం కానుంది.


ఒబామా గురువారం లీడర్షిప్ సమ్మిట్ లో పాల్గొంటారు. శుక్రవారం టౌన్ హాల్ లో 300 మందితో సమావేశమవుతారు. ఈ సమావేశాన్ని ఒబామా ఫౌండేషన్ నిర్వహించనుంది. ఈ సమావేశంలో ఒబామా దేశంలో ఉన్న యువ నాయకులతో మాట్లాడుతారు. సమావేశం ముగిసిన తరువాత ఒబామా ఫౌండేషన్ వీడియో ను యూట్యూబ్ లో పెడుతుంది.


ఒబామా మూడు దేశాల్లో పర్యటన నిమిత్తం భారత్ ను సందర్శించనున్నారు. భారత్ ను సందర్శించాక ఆయన చైనా, ఫ్రాన్స్ వెళతారు. చైనాలో ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్పింగ్ తో సమావేశమవుతారు.