కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయపార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. తాజాగా బీజేపీ పార్టీ కర్నాటక చీఫ్ బీఎస్. యడ్యురప్ప, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని 'బచ్చా(కిడ్)' అని వ్యాఖ్యానించారు. బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీఎస్. యడ్యురప్ప ఉన్నారు. బీజేపీ పార్టీ 150కి పైగా సీట్లు సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'కర్నాటకలో ఆ బచ్చా (రాహుల్ గాంధీ)ని తీసుకురావడంవల్ల, మేము 150 పైగా సీట్లలో విజయం సాధిస్తామని తెలుస్తోంది' అని యడ్యురప్ప అన్నారు.


అంతకు ముందు ఆయన.. కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ మురికివాడల్లో నివసించే ప్రజలను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. 'కాంగ్రెస్ పార్టీ పేదరికాన్ని నిర్మూలించడానికి తక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. 70 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో ఈ ప్రజలు ఇంకా మురికివాడల్లోనే నివసిస్తున్నారు. మేము అధికారంలోకి వస్తే పేదరికాన్ని నిర్మూలించడానికి ప్రాధ్యాన్యత ఇస్తాం. ఇది ఎన్నికల జిమ్మిక్కు కాదు.. మేము నిజంగా పేద ప్రజలకు సాయం చేయాలనుకుంటున్నాం' అన్నారు.


కర్నాటకలో 224 శాశనసభ స్థానాలకు ఈ ఏడాది ఏప్రిల్-మే నెలలో ఎన్నికలు జరగవచ్చని విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది.