ఢిల్లీ ఎన్నికలు: ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన బీఎస్పీ అభ్యర్థి
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 8న జరగనుండగా.. 11న ఫలితాలు వెలువడనున్నాయి. బీఎస్పీ అభ్యర్థి నాథూరామ్ కశ్యప్ అధికార ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు.
న్యూఢిల్లీ : ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలు తమ వ్యూహాలను పక్కాగా అమలు చేస్తున్నాయి. విద్వేషాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన నేతలపై ఎన్నికల కమిషన్ (ఈసీ) చర్యలు తీసుకుని తమ బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తోంది. మరో ఐదు రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలుండగా.. ఆమ్ ఆద్మీ పార్టీలోకి చేరికలు జోరుగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం బహుహజ్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నాథూరామ్ కశ్యప్ ఆప్‌లో చేరిపోయారు.
Also Read; BJP 40స్థానాలకు పైగా గెలుస్తుంది: అమిత్ షా
కరవాల్ నగర్ నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాథూరామ్ తాజాగా ఆప్ కండువా కప్పుకున్నారు. దీంతో అధికార ఆప్ ఈ నియోజకవర్గంలో మరింత పెరిగింది. కాగా, ఫిబ్రవరి 8న ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా, 11న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. అధికార ఆప్ మాత్రం ఢిల్లీ ప్రజలు తమకే మరోసారి పట్టం కడతారని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ధీమాగా ఉన్నారు. అయితే ఈసారి ఆప్‌ను అడ్డుకునేది తమ పార్టీనేనని బీజేపీ అధిష్టానం చెబుతోంది. ఈ ఎన్నికల్లోనూ ద్విముఖ పోరు ఖాయంగా కనిపిస్తోంది.