తెలంగాణ పోలీసులను చూసి ఢిల్లీ, యూపీ పోలీసులు నేర్చుకోవాలి: మాయావతి
తెలంగాణ పోలీసులు మంచి నిర్ణయం తీసుకుని అత్యాచార నిందితులకు సరైన శిక్ష విధించారని యూపీ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. తెలంగాణ పోలీసులను చూసి ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎంతో నేర్చుకోవాలని వారికి మాయావతి వారికి చురకలంటించారు.
లక్నో: తెలంగాణ పోలీసులను చూసి ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎంతో నేర్చుకోవాలని యూపీ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. షాద్‌నగర్‌లో దిశపై సామూహికంగా అత్యాచారం జరిపి ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేసిన నలుగురు నిందితులు శుక్రవారం తెల్లవారుజామున సైబరాబాద్ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమైన సంగతి తెలిసిందే. ఈ విషయమై మాయావతి స్పందిస్తూ.. ''తెలంగాణ పోలీసులు సరైన రీతిలో వ్యవహరించారని, వారి సాహసాన్ని స్వాగతిస్తున్నాం'' అని అన్నారు. ''తెలంగాణ పోలీసులు మంచి నిర్ణయం తీసుకుని అత్యాచార నిందితులకు సరైన శిక్ష విధించారు'' అని అభినందించారు. తెలంగాణ పోలీసులను చూసి ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎంతో నేర్చుకోవాలని వారికి మాయావతి చురకలంటించారు.
ఈ సందర్భంగా తెలంగాణ పోలీసులు దేశ పోలీసు వ్యవస్థకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసించిన మాయావతి.. మహిళలపై దాడులను అరికట్టాలంటే పోలీసు వ్యవస్థ ఇలాంటి చర్యలకు ఉపక్రమించక తప్పదని అభిప్రాయపడ్డారు.