కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ నేడే బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. 2019 ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం చివరి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. అయితే ఎప్పుడూ ఆంగ్లంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ఆర్థికశాఖ మంత్రి తొలిసారి నేడు హిందీలో బడ్జెట్‌‌ను గురించి సమగ్రంగా ప్రసంగించనున్నారు.


వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చాక ప్రవేశపెట్టనున్న తొలి బడ్జెట్‌ కావడంతో  జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో ఎక్కువ మొత్తం వ్యవసాయం, మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం గ్రామీణ ప్రజలకు, రైతులకు అర్థమయ్యే రీతిలో ఈసారి హిందీలో ప్రసంగించాలని అరుణ్‌ జైట్లీ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో హిందీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న తొలి ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీనే అవుతారు. కాగా 2019లో కూడా అధికారంలోకి రావాలనుకుంటున్న భాజపాకు ఈ బడ్జెట్‌ ఎంతో కీలకమైంది.