సబ్ కా సాత్ .. సబ్ కా వికాస్ .. సబ్ కా విశ్వాస్ మా నినాదం
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020-2021 సంవత్సరానికి గానూ వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టారు. సబ్ కా సాథ్ .. సబ్ కా వికాస్ .. సబ్ కా విశ్వాస్ నినాదంతో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఆమె తెలిపారు. అంత్యోదయులకు ఉపయోగపడే విధంగా బడ్జెట్ ను రూపొందించామని నిర్మలా సీతారామన్ చెప్పుకున్నారు. ప్రభుత్వం నుంచి నేరుగా ప్రతిఫలాలు పేదలకు అందినప్పుడే సంక్షేమ పథకాలకు అర్థం ఉంటుందన్నారు.
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020-2021 సంవత్సరానికి గానూ వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టారు. సబ్ కా సాథ్ .. సబ్ కా వికాస్ .. సబ్ కా విశ్వాస్ నినాదంతో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఆమె తెలిపారు. అంత్యోదయులకు ఉపయోగపడే విధంగా బడ్జెట్ ను రూపొందించామని నిర్మలా సీతారామన్ చెప్పుకున్నారు. ప్రభుత్వం నుంచి నేరుగా ప్రతిఫలాలు పేదలకు అందినప్పుడే సంక్షేమ పథకాలకు అర్థం ఉంటుందన్నారు.
ముఖ్యంగా బడ్జెట్ ను మూడు కేటగిరీలకు అన్వయించామన్నారు. యాస్పిరేషనల్ ఇండియా, ఆర్థిక వికాసం, అంత్యోదయ వికాసం కోసం బడ్జెట్ రూపొందించామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రానున్న రోజుల్లో డిజిటల్ ఇండియా, సోషల్ సెక్యూరిటీలోనూ పురోగతి సాధిస్తామని చెప్పారు. పరిశ్రమల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. 2020-2021కి వార్షిక సంవత్సరానికి పరిశ్రమల అభివృద్ధి కోసం 27 వేల 300 కోట్ల రూపాయలను ఆమె కేంద్ర బడ్జెట్ లో ప్రతిపాదించారు. పరిశ్రమలు, ఇతర అవసరాల కోసం విద్యుత్ ఉత్పత్తి చాలా కీలకమన్న నిర్మలా .. సంప్రదాయేతర ఇంధనాల ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్ కోసం 22 వేల కోట్ల రూపాయలను ప్రతిపాదించారు. దేశంలో ఉపరితల రవాణా, మౌళిక వనరుల కల్పన కోసం లక్షా 7 వేల కోట్ల రూపాయలను బడ్జెట్ లో కేటాయించినట్లు ఆమె చెప్పుకొచ్చారు.
రైల్వేలకు సోలార్ పవర్
రైల్వేలను మరింత ఆధునీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రైల్వేల నిర్వహణ కోసం ఎక్కువగా విద్యుశ్చక్తి వినియోగం అవుతోందని అన్నారు. దీన్ని తగ్గించేందుకు రైల్వేల్లో సోలార్ విద్యుత్చక్తి ప్రవేశ పెట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇందుకోసం రైల్వే పట్టాల వెంబడి ఉన్న సొంత భూమిలో సోలార్ ప్యానెళ్ల ద్వారా విద్యుత్ ను ఉత్పత్తి చేస్తామని తెలిపారు. తేజాస్ లాంటి స్పీడ్ రైళ్లను మరిన్ని దేశంలో ప్రవేశ పెడతామన్నారు. ముంబై నుంచి అహ్మదాబాద్ కు త్వరలోనే స్పీడ్ ట్రెయిన్ ను నడిపించేందుకు త్వరలోనే పనులు పూర్తి చేస్తామని తెలిపారు. చెన్నై- బెంగళూరు మధ్య ఎక్స్ ప్రెస్ వేను త్వరలోనే పూర్తి చేయనున్నామని ఆమె వెల్లడించారు.
100 విమానాశ్రయాలు నిర్మిస్తాం
ఉపరితల రవాణా రంగంతోపాటు గగనయానం కూడా దేశంలో పెరుగుతోందని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఉడాన్ పథకం కింద విమానయాన రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. త్వరలోనే ఇందుకోసం తగిన మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పుకొచ్చారు. 2024 వరకు దేశంలో 100 విమానాశ్రయాలు నిర్మిస్తామని తెలిపారు.
విద్యారంగాన్ని బలోపేతం చేస్తాం
మరోవైపు దేశంలోని యువతలో నైపుణ్యాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ నిర్దిష్ట ప్రణాళికతో పని చేస్తోందని తెలిపారు. నైపుణ్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు 3 వేల కోట్ల రూపాయల ప్రతిపాదనలు చేశారు. విద్యా రంగానికి 99 వేల 300 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. ప్రభుత్వం త్వరలోనే కొత్త విద్యా విధానాన్ని ప్రతిపాదిస్తుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశంలో జల్ జీవన్ మిషన్ కోసం ఆమె 3 లక్షల 60 వేల కోట్ల రూపాయల ప్రతిపాదనలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ మానస పుత్రిక స్వచ్ఛ భారత్ ను దేశంలో సమగ్రంగా నిర్వహిస్తున్నామని నిర్మలా సీతారామన్ చెప్పుకొచ్చారు. స్వచ్ఛ భారత్ మిషన్ కోసం 12 వేల 300 కోట్ల రూపాయలను ఆమె ప్రతిపాదించారు.