భారత ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్రపతి రామనాథ్ కోవింద్‌కి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఫిర్యాదు చేశారు. కర్ణాటక ఎన్నికల సందర్భంగా ఆయన కాంగ్రెస్ నాయకులను భయపించే భాషలో మాట్లాడారని ఆయన రాష్ట్రపతికి రాసిన లేఖలో పేర్కొన్నారు. మే 13వ తేదిన ఆయన రాసిన ఆ ఉత్తరాన్ని ఈ రోజు మీడియాకి విడుదల చేశారు. ఈ లేఖలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో పాటు కాంగ్రెస్ నేతలు గులామ్ నబీ ఆజాద్, కరణ్ సింగ్, మల్లిఖార్జున్ ఖర్గే, పి.చిదంబరం, ఏకే ఆంటోని, ఆనంద్ శర్మ  మొదలైనవారు కూడా ఫిర్యాదుదారులుగా ఉన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

6 మే, 2018 తేదిన హుబ్లీలో  ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ "కాంగ్రెస్ నేతలారా.. చెవులు రిక్కించి నా మాటలు వినండి. మీరు గనుక అతిక్రమణలకు పాల్పడితే నేను మోదీని అన్నమాట గుర్తుపెట్టుకోండి. మీరు చేసిన పనులకు మీరు ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుంది" అని తెలిపారు. అయితే మోదీ తీవ్ర పదజాలాన్ని వాడుతూ, దూషణలకు పాల్పడ్డారని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు


తాజాగా మన్మోహన్ సింగ్ రాష్ట్రపతికి రాసిన ఉత్తరంలో మాట్లాడుతూ "ఆ రోజు మోదీ చేసిన వ్యాఖ్యలు అశాంతిని కలిగించేలా, మమ్మల్ని కించపరిచేలా, భయపించేలా ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో ఒక దేశ ప్రధాని ప్రతిపక్షాన్ని భయపించే విధంగా వార్నింగ్ ఇవ్వడం ఎంత వరకు సబబు" అని తెలిపారు. కనుక, రాష్ట్రపతి స్వయాన ప్రధానికి ఈ విషయాన్ని తెలియజేసి హితబోధ చేయాలని ఉత్తరంలో పేర్కొన్నారు. పార్టీలకతీతంగా అందరూ ప్రధాని మాటలను ఖండించాలని ఆయన అన్నారు.