ఎన్నో సంవత్సరాలుగా సాగుతున్న కావేరి జలవివాద కథకి ఆఖరికి ముగింపు వచ్చింది. సుప్రీంకోర్టు తన తీర్పును ప్రకటించింది. ఈ తీర్పు ప్రకారం తమిళనాడు రాష్ట్రానికి అదనంగా 177.25 టీఎంసీలు నీటిని మాత్రమే విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వానికి కోర్టు తెలిపింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని కమిటీ ఈ తీర్పు వెలువరించింది. తాజా తీర్పు వల్ల కర్ణాటకకు అదనంగా 14.75 టీఎంసీల నీరు దక్కే అవకాశం ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతంలో కావేరీ జల వివాద పరిష్కార ట్రైబ్యునల్‌(సీడబ్ల్యూడీటీ) ఆ నదీజలాలను ఈ విధంగా కేటాయింపులు చేయమని చెప్పింది.  తమిళనాడుకు 419 టీఎంసీలు, కర్ణాటకకు 270 టీఎంసీలు, కేరళకు 30 టీఎంసీలు, పుదుచ్చేరికి 7 టీఎంసీలు ఇవ్వాలని తెలిపింది. అయితే ఆ కేటాయింపులను వ్యతిరేకిస్తూ.. రాష్ట్రాలన్నీ పిటీషన్లు ఫైల్ చేశాయి. పదే పదే పిటీషన్లు ఫైల్ చేసుకున్నాయి. 



ఈ క్రమంలో 2007లో ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. తమిళనాడుకు 227 టీఎంసీల నీటిని అప్పటికే కేటాయించగా... అదనంగా 192 టీఎంసీలను ఆ రాష్ట్రానికి విడుదల చేయమని కర్ణాటకను కోరింది. అయితే కర్ణాటక అందుకు ఒప్పుకోకపోగా.. మళ్లీ కోర్టుని ఆశ్రయించింది. ఈ క్రమంలో తాజాగా వెలువరించిన తీర్పులో 192 టీఎంసీలకు బదులు 177.25 టీఎంసీలు కర్ణాటక, తమిళనాడుకి విడుదల చేస్తే సరిపోతుందని సుప్రీంకోర్టు తెలిపింది.


అయితే, కేరళ, పుదుచ్చేరీ విషయంలో ఎలాంటి మార్పు ఉండదని.. ప్రస్తుతం అందిస్తున్న టీఎంసీలు సరిపోతాయని కోర్టు పేర్కొంది. తాజా తీర్పులో సుప్రీంకోర్టు మరో మాటను కూడా ప్రస్తావించింది. కావేరీ జలాలపై ఏ రాష్ట్రాలకు హక్కు ఉండదని.. ట్రిబ్యునల్ చెప్పినట్లు నడుచుకోవాలని తెలిపింది. తాజా తీర్పులో కూడా బెంగళూరుని నీటి ఎద్దడి సమస్య ఉందని కాబట్టి.. కర్ణాటకకు వాటా పెంచినట్లు తెలిపింది. అయితే కావేరీ బేసినులో ఉన్న 20 టీఎంసీల భూగర్భజలాల నుండి తమిళనాడు 10 టీఎంసీలు వాడుకోవచ్చని తెలిపింది. తాము ఇస్తున్న తీర్పు మరో 15 ఏళ్ళ వరకు మార్చే ప్రసక్తి లేదని కోర్టు తెలియజేసింది. 



ఈ తీర్పు కర్ణాటకకు అనుకూలంగా రావడంతో ఆ రాష్ట్రంలో పండగ వాతావరణం చోటు చేసుకుంది. ఈ క్రమంలో తమిళనాడు కౌన్సిల్ నవనీత క్రిష్ణ మాట్లాడుతూ, తాము కోర్టు తీర్పు గౌరవిస్తామని తెలిపారు. అయితే తమకు న్యాయం జరగడం కోసం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరిని కలుస్తామని ఆయన తెలిపారు. తమ నీటి కష్టాలు తీరడం కోసం గోదావరి నదిని కల్లనాయికి అనుసంధానించే యోచన ఉందని తెలిపారు.