ఢిల్లీ ఆప్ ప్రధాన కార్యాలయంలో సంబరాలు
అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్‌లో దూసుకెళ్తోంది. ఆప్ పార్టీ కార్యకర్తలు, నేతలు పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకుంటున్నారు.
న్యూఢిల్లీ : ప్రముఖ సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఓట్ల లెక్కింపులో దూసుకెళ్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. అధికార ఆప్ 50కి పైగా స్థానాలల్లో ఆధిక్యంలో కొనసాగుతూ సత్తా చాటుతోంది. బీజేపీ 15 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ ఖాతా తెరవడం ప్రశ్నార్థకంగా మారింది.
Also Read: బీజేపీ 55 సీట్లు నెగ్గుతుంది!: మనోజ్ తివారీ
తొలి ట్రెండ్స్ పరిశీలిస్తే ఎగ్జిట్ పోల్స్ అంచనా నిజమవుతున్నాయని వాదన వినిపిస్తోంది. మరోవైపు తమ విజయాన్ని ముందుగానే ఊహించిన ఆప్ ఒకరోజు ముందుగానే ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయాన్ని డెకరేట్ చేయడం గమనార్హం. మంగళవారం ఉదయం తొలి ట్రెండ్స్‌లో ఆప్ హవా కొనసాగిస్తుంటే.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఐటీఓలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. మరికొందరు కీలక నేతలు ఆప్ కార్యాలయానికి మరికాసేపట్లో చేరుకోనున్నారు. ఓట్ల లెక్కింపులో తమ పార్టీ హవా చూసిన ఆప్ శ్రేణులు స్వీట్లు, మిఠాయిలు పంచుకుని సెలబ్రేషన్ ప్రారంభించారు.
Also Read: ఢిల్లీ ప్రజలు AAPకే పట్టం కడతారు: డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా
ఒకరోజు ముందుగానే పార్టీ ఆఫీసును బెలూన్లు, రంగురంగుల పేపర్లతో అలంకరించారు. ఆప్ కీలక నేత, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా మరికొందరు నేతలు తమ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో కౌంటింగ్‌ను పరిశీలిస్తున్నారు. పార్టీ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున పార్టీ కేంద్ర కార్యాయానికి చేరుకుని వేడుకల్లో పాల్గొననున్నారు. ఉదయం 9 గంటలకు బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ముగిసింది.