న్యూఢిల్లీ: వృద్ధ తల్లితండ్రులను పట్టించుకోకుండా వారిని వేధింపులకు గురిచేసే వారికి ప్రస్తుతం విధిస్తున్న మూడు నెలల జైలు శిక్షను ఆరు నెలలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. వారి నెలవారీ అవసరాల కోసం 'పిల్లలు' ప్రస్తుతమిచ్చే దానికంటే అదనంగా కొంత నగదును ఇచ్చేలా చట్టాన్ని సవరించనుంది.


తల్లిదండ్రులు, వృద్దుల పోషణ, సంక్షేమం చట్టం 2007ను ప్రభుత్వం సమీక్షిస్తోందని కేంద్ర సాంఘిక సంక్షేమం, సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఈ చట్టంలోని 'పిల్లలు' అనే పదానికి నిర్వచనాన్ని విస్తృతపరచేందుకు ప్రతిపాదించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం ప్రకారం 'పిల్లలు' అనే పదం నిర్వచనంలోకి జీవసంబంధ పిల్లలు, మనుమలు మాత్రమే వస్తారు. ఇకపై దత్తతకు వచ్చిన పిల్లలు, సవతి పిల్లలు, అల్లుళ్ళు, కోడళ్ళు, మనుమలు, మనుమరాళ్లు, సంరక్షణలో ఉన్న మైనర్లను కూడా పిల్లలుగా పరిగణించే ఛాన్సుంది. ఈ సవరణలతో కేంద్ర సాంఘిక సంక్షేమం, సాధికారత మంత్రిత్వ శాఖ ‘తల్లిదండ్రులు, వృద్ధుల పోషణ, సంక్షేమ ముసాయిదా బిల్లు 2018’ ని రూపొందించింది.