న్యూఢిల్లీ: నేడు లోక్ సభ ఎన్నికల ఫలితాలతోపాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సైతం వెల్లడి కానున్న నేపథ్యంలో ఎటువంటి అల్లర్లు, హింస, అనిశ్చితికి తావులేకుండా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరించాల్సిందిగా కేంద్ర హోంశాఖ ఆదేశించింది. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాల్సిందిగా ఓట్ల లెక్కింపునకు ఒకరోజు ముందే అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలకు కేంద్ర హోంశాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు వెలువడ్డాయి.


ఇదిలావుంటే, లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సమయంలో పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకున్న విధ్వంసం, హింసను దృష్టిలో పెట్టుకున్న ఆ రాష్ట్రంలో మరింత భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. 200 కంపెనీల కేంద్ర బలగాలను పశ్చిమ బెంగాల్‌లో మొహరించారు. 7వ విడత ఎన్నికల నాటి నుంచే కేంద్ర భద్రతా బలగాలు పశ్చిమ బెంగాల్‌లో విధులు నిర్వహిస్తున్నాయి.