లోక్ సభను అట్టుడికించిన రఫెల్ డీల్ వివాదం, రాహుల్ గాంధీ ఆరోపణలపై అరుణ్ జైట్లీ ఆగ్రహం!
రఫెల్ డీల్ వివాదం : కాంగ్రెస్ పార్టీ తీరుపై అరుణ్ జైట్లీ ఆగ్రహం!
న్యూఢిల్లీ: రఫెల్ డీల్ మరోసారి లోక్ సభను కుదిపేసింది. బుధవారం రఫెల్ డీల్ పై చర్చ సందర్భంగా లోక్ సభలో అధికార పక్షం, కాంగ్రెస్ పార్టీకి మధ్య తీవ్ర వాగ్వీవాదం చోటుచేసుకుంది. రఫెల్ డీల్ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ తీవ్ర అవనితీకి పాల్పడిందని కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ముఖ్యంగా రఫెల్ డీల్‌కు సంబంధించిన అన్ని దస్త్రాలు ప్రస్తుత గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ బెడ్ రూమ్‌లో వున్నాయని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్ ప్రతాప్ సింగ్ చెబుతున్నట్టుగా ఓ ఆడియో క్లిప్ వుందని రాహుల్ గాంధీ ఆరోపించడం అధికార పక్షానికి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది.
రాహుల్ గాంధీ ఆరోపణలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పందిస్తూ.. రఫెల్ డీల్‌పై తాము ఇచ్చిన వివరణతో సుప్రీం కోర్టు సంతృప్తి చెందినా కాంగ్రెస్ పార్టీ మాత్రం సంతృప్తి చెందడం లేదని అసహనం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీకిగల రాజకీయ అవసరాలను తమ వివరణ సంతృప్తి పరచలేకపోయిందని, అందుకే ఆ పార్టీ దీనిపై ఇంత రాద్ధాంతం చేస్తోందని జైట్లీ ఎద్దేవా చేశారు.