టీచర్స్ డే... పేరెంట్స్ డే.. ఫ్రెండ్షిప్ డే.. ఇలా అన్ని రోజులదీ ఒక ఎత్తు.. ఈ రోజుది ఒక ఎత్తు. చిరు చిరు నగవులతో మనసును దోచే.. భావితర ప్రకాశదీపాలు చిన్నారులు. వారి ముద్దు ముద్దు మాటలు.. కేరింతలు ఎవరి మనసునైనా ఆహ్లాదపరుస్తాయనడంలో సందేహం లేదు. వారికి అంకితమిచ్చిన రోజే  చిల్డ్రన్స్ డే.  అచ్చ తెలుగులో చెప్పుకోవాలంటే "బాలల దినోత్సవం". భారతదేశంతో  పాటు అనేక దేశాల్లో పిల్లల కోసం ప్రత్యేకంగా ఇలా ఒక రోజును కేటాయించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే మన దేశంలో  తొలి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రు జయంతిని "బాలల దినోత్సవం"గా  జరుపుకుంటున్నాం. ఆ విశిష్టమైన రోజును పురస్కరించుకొని ఈ వ్యాసం ప్రత్యేకంగా మీకోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాలల గురించి ఒక్కొకరి ఆలోచన ఒక్కోలా ఉంటుంది. పాపం, పుణ్యం, ప్రపంచమార్గం.. కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలూ.. ఏమీ ఎరుగని పూవుల్లారా.. అయిదారేడుల పాపల్లారా! మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, ఆకసమున హరివిల్లు విరిస్తే.. అవి మీకే అని ఆనందించే కూనల్లారా! అని అంటారు మహాకవి శ్రీశ్రీ.  బాలలను ఆయన అర్థం చేసుకున్నంతగా ఇంకెవరూ అర్థం చేసుకోలేదని చెప్పవచ్చేమో. అవును..  అభం శుభం తెలియని ఆ పసి మనసులు.. పూతోటలో అప్పుడే పరిమళించిన పువ్వుల్లాంటి వారు. వారిని ఎలా మారిస్తే.. అలా మారిపోతారు. మచ్చ లేని చందమామలాంటి స్వచ్ఛమైనది బాల్యం. అలాంటి బాల్యం నేడు ఎన్నో  మానవ కుతంత్రాలకు బలైపోతోంది. కొన్ని పాఠశాలలు నేడు పిల్లలను కట్టడి చేసే కారాగారాలుగా తయారవుతున్నాయి. ఆసక్తికరమైన రీతిలో విద్యా బోధన సాగకుండా.. యాంత్రిక పద్ధతికి పెద్దపీట వేయడం వల్ల బాలలు సృజనాత్మకతకు దూరంగా పెరుగుతున్నారు. కేవలం విద్యార్జనకే పిల్లలను కట్టడి చేసి.. కొన్ని పాఠశాలల్లో పిల్లలను ఫిజికల్ ట్రైనింగ్‌కు.. క్రీడలకు దూరం చేయడం వల్ల వారు కేవలం పాఠాలు చదివి పరీక్షలు రాసే యంత్రాలగానే తయారవుతున్నారు. ఈ పద్ధతి మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 


అదేవిధంగా, పిల్లలకు సమాజం పట్ల ఒక అవగాహన ఏర్పాడాలంటే.. చిన్నప్పటి నుండీ వారికి దేశ సామాజిక పరిస్థితులకు మీద కూడా అవగాహన కల్పించాలి. ఆ బాధ్యతను తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు కూడా తీసుకోవాలి. పిల్లలకు మన జానపద కళలను పరిచయం చేయాలి. సాహిత్యం, చరిత్ర పట్ల అభిరుచిని పెంపొందించాలి. పుస్తక పఠనాన్ని పోత్సహించాలి. పశుపక్ష్యాదుల పైనా, పర్యావరణం పైనా  వారికుండాల్సిన అక్కర గురించి తెలపాలి. దేశభక్తిని కలిగించే సమరయోధుల గాథలను వారికి విశదీకరించి చెప్పాలి చదువంటే కేవలం పాఠ్యాంశాల్లో బోధించే పాఠ్యభాగాలు మాత్రమే కాదు. ప్రయోగాలు.. పరిశోధనలు కూడా. అందుకే పిల్లలను మంచి అన్వేషకులుగా మార్చే కర్తవ్యం విద్యాలయాలపై ఉంది. సైన్సు వారి దైనందిన జీవితంలో ఎంత ప్రధానమైన పాత్ర పోషిస్తుందో పిల్లలకు ప్రాక్టికల్‌గా బోధించాలి. అలాంటి బోధన చేసే విద్యాలయాలను ప్రభుత్వం కూడా ప్రోత్సహించాలి. 


ఇక బాలల దినోత్సవం విషయానికి వస్తే.. ఇలాంటి ఒక రోజును ప్రత్యేకంగా అన్ని దేశాలు జరుపుకోవాల్సిన అవసరం ఉందని 1954లో ఐక్యరాజసమితి తొలిసారిగా గుర్తించింది. నేటి బాలలే రేపటి పౌరులని.. వారే నవజాతినిర్మాతలని చాటి చెబుతూ.. తనకు వీలు చిక్కినప్పుడల్లా వారిని కలిసి మాట్లాడుతూ.. వారి ముద్దు ముద్దు మాటల ద్వారా తనకు తెలియని విషయాలు తెలుసుకుంటూ ఆశ్చర్యబోయే మానవతావాది  జవహర్ లాల్ నెహ్రు. దేశం విద్యావ్యవస్థలో సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని ఎప్పుడో ఆకాంక్షించారాయన. తన బిడ్డ ఇందిరా ప్రియదర్శిని శాంతినికేతనంలో చదువుతున్నప్పుడు, ఆమెకు ఉత్తరాలు రాసి ప్రేరణను నింపేవారు. ఆయననే ఆదర్శంగా తీసుకొని నేటి తల్లిదండ్రులు కూడా తమ బిడ్డలకు ఏది అవసరమో తెలుసుకుంటే... భారతావనిలో బాలల ఉన్నతికి సరికొత్త మార్గం సుగమం అవుతుందనడంలో సందేహం లేదు.