న్యూఢిల్లీ: భారత్‌లో ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన చైనా.. దాడికి బాధ్యత వహించిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజా‌ర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత్ డిమాండ్‌ను మాత్రం పెడచెవిన పెట్టింది. జమ్మూకాశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ జవాన్లపై గురువారం ఉగ్రవాదులు దాడికి పాల్పడిన ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నట్టు చైనా విదేశీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఉగ్ర దాడిపై చైనా విదేశీ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిథి గెంగ్ షువాంగ్ మాట్లాడుతూ.. దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఉగ్రదాడి ఏ రూపంలో వున్నా.. ఆ దాడిని చైనా తీవ్రంగా ఖండిస్తామని స్పష్టంచేశారు.


జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజర్‌పై తక్షణం నిషేధం విధించాల్సిందిగా భారత్ కోరగా.. అందుకు చైనా నిరాకరించింది. జైషే మహ్మద్ సంస్థ ఇప్పటికే ఉగ్రవాద సంస్థల జాబితాలో ఉందని చెబుతూనే వ్యక్తుల పేర్లను జాబితాలో చేర్చడంపై ఓ గౌరవప్రదమైన పద్ధతిని అవలంభిస్తామని పేర్కొన్నారు.