ఓ లైసెన్స్ లేని ప్రబుద్ధుడు చేసిన నిర్వాకం వల్ల ఓ విద్యార్థిని నిండు ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసి పోయాయి. వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూరులో ఓ కళాశాలలో సెకండ్ ఇయర్ బీబీఏ కోర్సు చదువుతున్న లోకేశ్వరి అనే అమ్మాయి వద్దంటున్నా.. బలవంతంగా మాక్ డ్రిల్ చేయాలని బిల్డింగ్ మీద నుండి ట్రైనర్ ఆర్ముగం తోసేయడంతో.. ఆమె తల సన్ షేడ్‌కు గట్టిగా తగిలి తీవ్ర రక్తస్రావం అయ్యింది. వెంటనే విద్యార్థులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. ఆమె చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాధారణంగా కళాశాలలతో పాటు ఇతర సంస్థలలో వ్యక్తులకు డిజాస్టర్ మేనేజ్ మెంట్ పై అవగాహన కల్పించడం కోసం మాక్ డ్రిల్ కార్యక్రమాలను సుశిక్షితులైన టైనర్స్ సహాయంతో నిర్వహిస్తుంటారు. అయితే తాజాగా జరిగిన సంఘటనకు సంబంధించి తమ బాధ్యత ఏమీ లేదని చెబుతోంది ఎన్‌డీఎంఏ(నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ). తమకు ఈ డ్రిల్ నిర్వహించిన ట్రైనర్ ఆర్ముగం ఎవరో తెలియదని.. ఆయనకు ఎన్‌డీఎంఏ ఎలాంటి లైసెన్స్ ఇవ్వలేదని తేల్చి చెప్పింది. అలాగే తాము ఎవరినీ ఇలాంటి మాక్ డ్రిల్స్ నిర్వహించడానికి ఎక్కడికీ పంపించలేదని కూడా ఎన్‌డీఎంఏ తెలియజేసింది.


అయితే ఎన్‌డీఎంఏ పర్మిషన్ లేకుండా ఆర్ముగం ఈ మాక్ డ్రిల్ ఎందుకు నిర్వహించారు.. ఒకవేళ ఎన్‌డీఎంఏ పేరు వాడుకుంటూ వీరు ప్రతీ కళాశాలకు వెళ్లి ఇలాంటి డ్రిల్స్ నిర్వహించడం లేదు కదా..! అన్న సందేహాన్ని కూడా వెల్లడిస్తున్నారు పోలీసులు. కాగా, తాజాగా జరిగిన సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన యువతి కుటుంబానికి నష్టపరిహారం క్రింద రూ.5 లక్షలు అందిస్తున్నామని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. జరిగిన సంఘటనపై పూర్తి వివరాలతో కూడిన రిపోర్టు ఇవ్వాల్సిందిగా కోయంబత్తూరు పోలీసులను ఆదేశించింది.


అసలు పర్మిషన్ లేకుండా ఈ డ్రిల్ ఎందుకు నిర్వహించారో తెలుసుకోవాలని.. అందులో భాగస్తులైన వ్యక్తులందరిపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది. ఈ డ్రిల్ నిర్వహించేటప్పుడు శిక్షకుడు విద్యార్థులను కూడా అందులో భాగస్వాములను చేశాడు. ముందు రక్షణ కోసం క్రింద వలను ఏర్పాటు చేసి.. విద్యార్థులను దానిని గట్టిగా పట్టుకోమని కూడా తెలిపాడు. ఆ తర్వాత విద్యార్థిని వద్దంటున్నా.. ఆమెను బలవంతంగా తోసేయడంతో ఆమె తలకు గట్టి దెబ్బ తగిలి రక్తస్రావం అయ్యింది.