లోక్‌సభ మాజీ స్పీకర్, సీపీఐ(ఎం) సీనియర్ నేత సోమ్‌నాథ్ ఛటర్జీ(89) ఆరోగ్యం విషమంగా ఉంది. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. సోమ్‌నాథ్ ఛటర్జీ కిడ్నీ, శ్వాససంబంధిత సమస్యలతో కోల్‌కతాలోని  ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు డయాలసిస్‌ను నిర్వహించడంతో పాటు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని వైద్యులు వెల్లడించారు. ఛటర్జీ ఆరోగ్య పరిస్థితి విషమించినట్టు తెలియగానే పలువురు వామపక్ష నేతలు ఆసుపత్రిని సందర్శించారు.
 
సోమ్‌నాథ్ ఛటర్జీ 10 సార్లు లోక్‌సభ సభ్యుడిగా సుదీర్ఘ సేవలందించారు. 1971 నుంచి 2009 వరకు (1984 ఎన్నికల్లో మినహా) లోక్‌సభ సభ్యుడిగా పనిచేశారు. 1968లో సీపీఎంలో చేరిన ఛటర్జీ 2008 వరకు సభ్యుడిగా ఉన్నారు. 2004-
2009 వరకు ఐదేళ్లపాటు లోక్‌సభ స్పీకర్‌గా సేవలందించారు. 2008లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం నుంచి సీపీఎం వైదొలగిన తరువాత సోమ్‌నాథ్‌ తన స్పీకర్‌ పదవికి రాజీనామా చేయలేదు. దీంతో సీపీఎం ఆయనను పార్టీనుంచి బహిష్కరించింది. అప్పటినుంచి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా కొనసాగుతున్నారు.