యోగి ఆదిత్యనాథ్‌ని అసలు పేరుతో పిలిచిన కాంగ్రెస్..!
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ఆయన అసలు పేరుతో సంబోధించి కాంగ్రెస్ మరో వివాదానికి తెరదీసింది. సాధారణంగా సన్యాసాన్ని స్వీకరించాక.. ఎవరూ తమ గత పేర్లను, గత జీవిత విశేషాలను బహిర్గతం చేయరు. వాటి గురించి ఎక్కడా ప్రస్తావించరు కూడా.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ఆయన అసలు పేరుతో సంబోధించి కాంగ్రెస్ మరో వివాదానికి తెరదీసింది. సాధారణంగా సన్యాసాన్ని స్వీకరించాక.. ఎవరూ తమ గత పేర్లను, గత జీవిత విశేషాలను బహిర్గతం చేయరు. వాటి గురించి ఎక్కడా ప్రస్తావించరు కూడా. పేరు మార్చుకున్నాక.. కొత్త పేరుతోనే వారు చెలామణీ అవుతుంటారు. కానీ ఆ సంప్రదాయాన్ని భంగ పరుస్తూ...కాంగ్రెస్ అధికారిక ట్విటర్ హ్యాండిల్ నిర్వాహకులు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో యోగి ఆదిత్యనాథ్‌ని ఆయన అసలు పేరుతో సంబోధించారు.
"కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నుండి గౌరవనీయులైన అజయ్ బిష్త్ గారు మంచి ప్రభుత్వమెలా పనిచేయాలన్న విషయం మీద పాఠాలు నేర్చుకున్నందుకు సంతోషం. అలా నేర్చుకున్న పాఠాల వల్లే ఆయన అవసరంలో ఉన్న తన ప్రజల సమస్యలు తీర్చడానికి ఉత్తర ప్రదేశ్ వెళ్లారు" అని పేర్కొంటూ యోగి ఆదిత్యనాథ్ మీద ప్రచురించిన ఓ వార్త లింక్‌తో కూడిన ట్వీట్ షేర్ చేశారు
ఇటీవలే కర్ణాటక సీఎం, యూపీ సీఎం ఆదిత్యనాథ్‌కు ఉచిత సలహా ఇస్తూ.. కర్ణాటక ఎన్నికల ప్రచారం గురించి ఎక్కువగా ఆలోచించవద్దని.. ముందు యూపీలో ప్రాణాలు కోల్పోతున్న ప్రజలను పట్టించుకోవాలని హితవు పలికారు. తాజాగా అదే విషయాన్ని తెలుపుతూ... ఆదిత్యనాథ్ అసలు పేరుతో వచ్చిన ట్వీట్ పై మిశ్రమ స్పందనలు వచ్చాయి. "సన్యాసులు తమ గత జీవితాన్ని విడిచిపెట్టాక.. పేరుతో పాటు అన్నింటినీ త్యజిస్తారు. అలాంటప్పుడు ఆయనను మళ్లీ అదే పేరుతో పిలవడమంటే తనను అవమానించడమే. ఇలాంటి నీచపు ఆలోచనలు కాంగ్రెస్‌కి రావడం బాధాకరం. హిందూమతం పై వారికున్న ద్వేషాన్ని ఇది చూపిస్తుంది" అని పలువురు నెటిజన్లు ఈ ట్వీట్‌కు సమాధానం ఇచ్చారు